ఏంటి రస్సీ, నీ బాధేంటి అసలు..? డసెన్ తో వాగ్వాదానికి దిగిన బట్లర్.. అంపైర్ల మందలింపు
SAvsENG: ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్.. సఫారీ బ్యాటర్ రస్సీ వన్ డర్ డసెన్ లు వాదులాడుకున్నారు. బట్లర్.. డసెన్ తో ‘నీ బాధేంటి రస్సీ..?’అని వాపోయాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఓడి సిరీస్ ను చేజార్చుకుంది. నిన్న ముగిసిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసినా బౌలర్లు విఫలమవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్.. సఫారీ బ్యాటర్ రస్సీ వన్ డర్ డసెన్ లు వాదులాడుకున్నారు. బట్లర్.. డసెన్ తో ‘నీ బాధేంటి రస్సీ..?’అని వాపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతున్నది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అదిల్ రషీద్ వేసిన 19వ ఓవర్లో ఓ బంతిని డసెన్ డిఫెన్స్ ఆడబోయాడు. బంతి కాస్తా బ్యాట్ కు తాకి అతడి ప్యాడ్ కు తాకింది. దానిని కిందపడేలోగా అందుకోవాలని వికెట్ల వెనుక ఉన్న బట్లర్ ప్రయత్నించాడు. కానీ అందులో అతడు విఫలమయ్యాడు. డసెన్ అడ్డురావడంతో బట్లర్ క్యాచ్ అందుకోలేకపోయాడు.
క్యాచ్ మిస్ అయ్యాక బట్లర్ డసెన్ తో.. ‘నేను బాల్ ను అందుకోవాలనుకున్నాను. నీ ప్రాబ్లమ్ ఏంటి రస్సీ..? అన్ని వేళలా నీ గురించే ఆలోచిస్తాననుకున్నావా..?’అని గెలికాడు. దానికి డసెన్.. ముఖం కిందకు దించుకుని ఏదో అన్నాడు. అప్పుడు బట్లర్ మళ్లీ.. ‘నాకు ఆ బాల్ ను అందుకునే హక్కు ఉంది. నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావ్..?’అని కొంచెం స్వరం పెంచి అన్నాడు. అప్పుడే అంపైర్లు ఇద్దరినీ.. ‘ఇక చాల్లేండి.. కొంచెం కూల్ అవ్వండి..’ అనడంతో ఇద్దరూ ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు. అయితే ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకునే అవకాశమున్నట్టు సమాచారం. అదే జరిగితే ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో కోత లేదంటే పలు మ్యాచ్ లలో నిషేధం తప్పకపోవచ్చు.
ఇక ఇరు జట్ల మధ్య ముగిసిన రెండో వన్డే విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ (94 నాటౌట్), హ్యారీ బ్రూక్ (80), మోయిన్ అలీ (51) లు రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. 49.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. కెప్టెన్ టెంబ బవుమా (109) సెంచరీతో కదం తొక్కగా డేవిడ్ మిల్లర్ (58), మార్క్రమ్ (49), మార్కో జాన్సేన్ (32 నాటౌట్) లు రాణించారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే దక్షిణాఫ్రికా రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్ లో మూడో వన్డే ఫిబ్రవరి 1న జరుగనుంది.