బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి, బూట్లతో తన్నుతూ... బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ... ‘బాల్ టాంపరింగ్‌’కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లు...

విజయం సాధించడం కోసం ఎలాంటి ఎత్తులు వేయడంలో ఆస్ట్రేలియా ముందుంటుంది. సెడ్జింగ్, ఛీటింగ్, బాల్ టాంపరింగ్... ఇలా అనేకసార్లు ఆస్ట్రేలియా చేసిన చాలా పనులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రెండేళ్ల క్రితం సాండ్ పేపర్‌తో బంతి షేప్‌ని మార్చడానికి ప్రయత్నించి, ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్. తాజాగా ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా అదే బాట పడుతున్నట్టు కనిపిస్తోంది...

నాటింగ్‌హమ్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదో రోజు వర్షం కురవడంతో భారత్ చేతుల్లో పరాజయం నుంచి తప్పించుకుని, ఊపిరి పీల్చుకుంది ఇంగ్లాండ్. లార్డ్స్ టెస్టులో కూడా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కి ఆశించిన ఫలితం అయితే రాలేదు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టును ఇబ్బందిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంగ్లాండ్ ప్లేయర్లు.

బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ... బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ... బాల్ ఆకారం మార్చడానికి ఇంగ్లాండ్ ప్లేయర్లు మార్క్ వుడ్, ఓల్లీ రాబిన్‌సన్ ప్రయత్నిస్తుండడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది.

నిబంధనలకు విరుద్ధంగా సాండ్ పేపర్ వాడి ఆస్ట్రేలియా ప్లేయర్లు దొరికిపోతే... ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం కనిపించి, కనిపించకుండా... కనిపించినా దొరకకుండా ఉండేలా నాటకీయంగా బాల్ టాంపరింగ్‌కి పాల్పడుతున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భారత అభిమానులు... ఈ విషయంపై ఐసీసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి...