Asianet News TeluguAsianet News Telugu

తల మీద మూడో కన్నుతో బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్ ఆటగాడు.. ఆమోదం తెలిపిన ఐసీసీ

ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న ఐదో టెస్టులో టీవీ ప్రేక్షకులు.. క్రికెట్ మజాను ‘చాలా దగ్గర్నుంచి’ చూసే అనుభూతి పొందనున్నారు. 

England Player Ollie Pope To Field With Camera on His Helmet in Edgbaston Test, Sky Sports gets Nod
Author
India, First Published Jun 30, 2022, 6:37 PM IST

ఎడ్జబాస్టన్ వేదికగా జులై 1 నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగబోయే ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అఫిషియల్ బ్రాడ్కాస్టర్ స్కై స్పోర్ట్స్ సరికొత్త హంగులద్దనుంది. రొటీన్ గా నలుగురు బ్రాడ్కస్టర్లతో మ్యాచ్ ను విశ్లేషిస్తూ.. గంటల తరబడి  బండిని లాగడం కష్టమనుకుందో ఏమో గానీ.. టీఆర్పీలు పడిపోకుండా.. మ్యాచ్ చూసేవాళ్లకు సరికొత్త అనుభూతినిచ్చేలా అదిరిపోయే ప్లాన్ వేసింది. ఈ మ్యాచ్ ను టీవీ ప్రేక్షకులు మరింత దగ్గర్నుంచి చూసేందుకు గాను.. షాట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేసే ఇంగ్లాండ్ ప్లేయర్  హెల్మెట్ కు మూడో నేత్రం.. అదేనండి.. కెమెరాను అమర్చనుంది.  

ఈ మేరకు స్కై స్పోర్ట్స్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తో పాటు ఈసీబీ అనుమతి కూడా పొందింది. ఇక ఇంగ్లాండ్ తరఫున షాట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేసేది యువ ఆటగాడు  ఓలీ పోప్. అతడు ఫీల్డింగ్ చేసే షాట్ లెగ్ వద్ద  పెట్టుకునే హెల్మెట్ కు కెమెరాను అమర్చనున్నారు. 

తద్వారా టీవీ ల ముందు కూర్చుని మ్యాచును తిలకించే అభిమానులు.. ‘బ్యాటర్లకు దగ్గరగా..’ ఉండి ఆ అనుభూతిని పొందొచ్చు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ కెమెరా.. స్టేడియంలోని ప్రేక్షకుల అరుపులను రికార్డు చేయదు. కేవలం తన ముందు ఉన్న బ్యాటర్ కదలికలు,  అతడి ఆటను  దగ్గరగా రికార్డు చేస్తుంది.  

స్కై స్పోర్ట్స్ గతేడాది ఇంగ్లాండ్ లో ప్రారంభించిన ‘ది హండ్రెడ్ లీగ్’ లో ఈ టెక్నిక్ కు ఉపయోగించింది. ది హండ్రెడ్ లీగ్ లో ఫీల్డర్ల కు కాకుండా  అంపైర్ల క్యాప్స్ కు అమర్చారు. కానీ అంతర్జాతీయ టెస్టు మ్యాచులలో ఒక ఫీల్డర్ హెల్మెట్ కు కెమెరాను అమర్చడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో ఐపీఎల్ లో ప్లేయర్లకు  మైక్ లు ఇచ్చి మ్యాచ్ మధ్యలో సంభాషణ సాగిన విషయం అందరికీ విధితమే. కానీ కెమెరాలు పెట్టడం మాత్రం ఇదే తొలిసారి. మరి భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ మూడో నేత్రం ఎవరి తలమీదకు ఎక్కుతుందో చూడాలి.. 

 

కాగా శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే చివరి టెస్టులో ఆడే జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని 12మంది ఆటగాళ్లను ట్విటర్ వేదికగా అనౌన్స్ చేసింది. 

ఇండియాతో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు : అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్) మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్ 

Follow Us:
Download App:
  • android
  • ios