పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది. 81/4 పరుగుల వద్ద మొదటి సెషన్‌ను ముగించిన ఇంగ్లాండ్, టీ బ్రేక్ తర్వాత నాలుగో బంతికే ఒల్లీ పోప్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే బెన్ స్టోక్స్ కూడా పెవిలియన్ చేరాడు.  

12 బంతులు ఆడి, కేవలం ఒకే పరుగు చేసిన ఓల్లీ పోప్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 24 బంతుల్లో 6 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.  81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.

ఓపెనర్ జాక్ క్రావ్లీ 84 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కెప్టెన్ జో రూట్ 37 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. సిబ్లీ, బెయిర్ స్టో డకౌట్ అయ్యారు.