Asianet News TeluguAsianet News Telugu

The Ashes: వేదిక మారినా తలరాత మారలేదు.. తీరు మారని ఇంగ్లాండ్.. 185కే ఆలౌట్

Australia Vs England: ప్రతిష్టాత్మక సిరీస్ కు ముందు ఆత్మవిశ్వాసంతో ఆసీస్ కు వచ్చిన ఇంగ్లీష్ జట్టు వరుసగా మూడో టెస్టులో కూడా అదే ఆటతీరును కొనసాగించింది.  మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు  తొలి ఇన్నింగ్సులో  ఇంగ్లీష్ జట్టు 185 పరుగులకే చాప చుట్టేసింది.

England Flop show continues IN Ashes, Joe Root and co. collapse at 185 in First Innings In Boxing Day Test
Author
Hyderabad, First Published Dec 26, 2021, 12:17 PM IST

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు బ్యాట్ టైమ్ కొనసాగుతున్నది.  ఏ ముహుర్తాన  ఇంగ్లీష్ జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిందో కానీ యాషెస్ సిరీస్ లో జో  రూట్ సేనకు కష్టాలు కామనయ్యాయి. ప్రతిష్టాత్మక సిరీస్ కు ముందు ఆత్మవిశ్వాసంతో ఆసీస్ కు వచ్చిన ఇంగ్లీష్ జట్టు వరుసగా మూడో టెస్టులో కూడా అదే ఆటతీరును కొనసాగించింది. యాషెస్  సిరీస్ లో భాగంగా  మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్, బెయిర్  స్టో మినహా ఆ జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరు కూడా నిలకడగా ఆడలేదు. 

బాక్సింగ్ డే టెస్టులో  టాస్ గెలిచిన ఆసీస్.. పర్యాటక జట్టుకు  ముందు బ్యాటింగ్ అప్పగించింది. ఈ  సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు.. మూడో టెస్టులో కూడా అదే బాటను అనుసరించారు. హసీబీ హమీద్ (0) డకౌట్ కాగా... క్రాలే (12) కూడా త్వరగానే నిష్క్రమించాడు. ఆ తర్వాత వచ్చిన ఇన్ఫామ్  బ్యాటర్ డేవిడ్ మలన్ (14) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూడు వికెట్లు ఆసీస్ సారథి పాట్ కమిన్సే తీయడం విశేషం. దీంతో ఇంగ్లాండ్ 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

 

ఈ సమయంలో ఆ జట్టు సారథి రూట్ (82 బంతుల్లో 50) కాసేపు ప్రతిఘటించాడు.  తన సహజ శైలికి భిన్నంగా ధాటిగా  ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ రికార్డును బ్రేక్ చేశాడు. 13 ఏండ్ల క్రితం స్మిత్.. క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు (1656 పరుగులు) సాధించిన కెప్టెన్ గా రికార్డు సాధించాడు.  అంతేగాక ఆసీస్ లో ఆసీస్ పై అతడికి ఇది తొమ్మిదో హాఫ్ సెంచరీ. పర్యాటక జట్టు కెప్టెన్లెవరూ ఇన్ని అర్థ శతకాలు సాధించలేదు. కానీ  ఆసీస్ లో ఇంతవరకూ రూట్ సెంచరీ చేయలేదు. 

 

హాఫ్ సెంచరీతో జోరు మీదున్న రూట్ ను స్టార్క్ ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (25), బెయిర్ స్టో (35) లు నిలదొక్కుకోవాలని చూసినా ఆసీస్ బౌలర్లు వారికి ఆ అవకాశమివ్వలేదు. స్టోక్స్ ను గ్రీన్ ఔట్ చేయగా.. బెయిర్ స్టో ను స్టార్క్ పెవిలియన్ కు పంపాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వారిలో రాబిన్సన్ (22) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. అడిలెడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ (3) కూడా త్వరగానే నిష్క్రమించాడు. 

ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్ కు మూడు వికెట్లు దక్కగా.. లియాన్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ కు  2, బొలాండ్, గ్రీన్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.  తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 3 ఓవర్లు ముగిసేసరికి 11 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (2 నాటౌట్), మార్కస్ హారిస్ (8 నాటౌట్) ఆడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios