టీమిండియా డాషింగ్ బ్యాట్ మెన్ యువరాజ్ పేరు చెప్పగానే  ముందుగా గుర్తచ్చేది ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డు. ఒక ఓవర్లో యాట్రిక్ సిక్సర్లు బాదడమే చాలా కష్టం. అలాంటిది అంతర్జాతీయ స్థాయి ఉత్తమ బౌలర్ పై విరుచుకుపడుతూ ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు బాదిన ఘనత యువీకే దక్కుతుంది. ఈ విద్వంసం తర్వాత ఆ బౌలర్ పరిస్థితి ఎలా వుంటుందో చెప్పనవసరం లేదు. అలా యువరాజ్ చేతిలో ఘోరంగా దెబ్బతిన మైదానంలోనే కన్నీరు పెట్టుకున్న ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తాజాగా యువీ రిటైర్మెంట్ పై స్పందించాడు. 

యువరాజ్ రిటైర్మెంట్ గురించి ఇంగ్లాండ్ పేసర్ బ్రాడ్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. '' లెజెండ్...రిటైర్మెంట్ ను ఎంజాయ్ చెయ్'' అని పేర్కొన్నాడు. అయితే తనను ఎన్నో నిద్రల్లేని రాత్రులు గడిపేలా చేసిన యువీని బ్రాడ్ లెజెండ్ అని సంబొధించడం అభిమానులకు ఆకట్టుకుంటుంది. దీంతో బ్రాడ్ ట్వీట్ పై వారు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. 

ఓసారి 2007 టీ20 ప్రపంచ కప్ నాటి ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సమయంలో క్రీజులో వున్న యువీతో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ ప్లింటాఫ్ గొడవపెట్టుకున్నాడు. ఇకేముంది ఈ గొడవ తర్వాత యువరాజ్ తన విశ్వరూపం చూపించాడు. కెప్టెన్ చేసిన తప్పుకు బైలర్ బ్రాడ్ బలయ్యాడు. అతడు బౌలింగ్ లో వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలిస్తూ యువీ ఆ ఓవర్ మొత్తం సిక్సర్లే బాదాడు. ఇలా ఇంగ్లాండ్ కెప్టెన్ కు తన బ్యాట్ తో బుద్ది చెప్పాడు. కానీ యువీ విధ్వసానికి బలైన బ్రాడ్ మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు.

ఇలా యువరాజ్ ఈ మ్యాచ్ లోనే కేవలం 12 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకుని మరో రికార్డును కూడా నెలకొల్పాడు. ఇలా ఇంగ్లాండ్ పై టీమిండియా ఘన విజయం సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీమొత్తంలో యువరాజ్ రాణించి భారత్ కు మొదటి టీ20 ప్రపంచ కప్ ను అందించాడు.