కరోనా కారణంగా సుమారు 117 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులు అల్లాడిపోయారు. పరిస్థితిని చూస్తే అసలు ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని కూడా ఊహించడానికి కూడా భయపడ్డారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ నిర్వహించి తీరాలని సంకల్పించింది. ఎంతో కట్టుదిట్టంగా బయో సెక్యూర్ విధానంలో ఆటగాళ్లను, క్రికెట్ అధికారులు, ఆటగాళ్లు బస చేసే హోటల్ సిబ్బందిని ఓ సురక్షిత వలయంలో ఉంచి విజయవంతంగా తొలి టెస్ట్ నిర్వహించింది.

ఈ భద్రతా వలయం దాటి బయటి నుంచి ఎవరూ లోపలికి ప్రవేశించడం కానీ, లోపలి వారు బయటకు రావడం లాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. తద్వారా కరోనా సోకకుండా ఆటగాళ్లను, అంపైర్లను, ఇతర సిబ్బందిని రక్షించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కానీ ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ వలయం నుంచి అడుగుపెట్టడంతో ఈసీబీ కన్నెర్ర చేసింది. అతనిని రెండో టెస్టు నుంచి పక్కనబెట్టింది. ఇంగ్లాండ్- వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ నేటి నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనుంది.

ఇంగ్లీష్ జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగిన ఆర్చర్ అందుబాటులో లేకపోవడం ఇంగ్లీష్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే. తొలి టెస్టులో విండీస్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.