ENG vs SA: సుమారు రెండు నెలలుగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా.. టెస్టు సిరీస్ ను ఓటమితో ముగించింది. ఓవల్ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లాండ్.. 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లాండ్ పర్యటనను దక్షిణాఫ్రికా ఓటమితో ముగించింది. దాదాపు రెండు నెలలుగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సఫారీలు.. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా ఆ జట్టుతో ముగిసిన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది. సఫారీలు విధించిన 129 పరుగుల లక్ష్యాన్ని 22 ఓవర్లలోనే ఛేదించి టెస్టుతో పాటు సిరీస్ నూ సొంతం చేసుకుంది.
ఓవల్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 118 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో రాబిన్సన్ 5 వికెట్లు తీయగా.. స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లతో చెలరేగాడు. బదులుగా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 158 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో జాన్సేన్ కు 5 వికెట్లు దక్కగా.. రబాడా నాలుగువికెట్లతో చెలరేగాడు. దీంతో ఇంగ్లాండ్ కు 30 పరుగుల ఆధిక్యం దక్కింది.
రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా.. 169 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో డీన్ ఎల్గర్.. 59 బంతుల్లో 36 పరుగులు చేశాడు. సారెల్ ఎర్వీ.. 26 పరుగులు చేయగా.. కీగన్ పీటర్సన్ 23 రన్స్ చేశాడు. మిగిలిన వారిలో ఒక్కరు కూడా 20 పరుగులు కూడా చేయలేకపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. 22.3 ఓవర్లలో ఒక్కవికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లలో అలెక్స్ లీస్ (39) ఫర్వాలేదనిపించాడు. జాక్ క్రాలే (69) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓలీ పోప్ (11 నాటౌట్) తో కలిసి క్రాలే లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో ఇంగ్లాండ్.. మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో దక్కించుకుంది. తొలి టెస్టులో సౌతాఫ్రికా.. గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు టెస్టులలో ఇంగ్లాండ్ నెగ్గింది. ఈ విజయంతో ఇంగ్లాండ్.. ఈ సమ్మర్ సీజన్ లో వరుసగా రెండు టెస్టు సిరీస్ లను గెలుచుకుంది. జూన్ లో ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత భారత్ తో రీషెడ్యూల్ టెస్టు ఆడినా అది డ్రా గా ముగిసింది. అదీగాక ఇది గతేడాది ఆడిన సిరీస్ కావడం గమనార్హం.
