రావల్పిండిలో రఫ్ఫాడించిన ఇంగ్లాండ్.. పాకిస్తాన్‌పై సంచలన విజయం..
PAKvsENG: రావల్పిండి వేదికగా జరిగిన పాక్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. పాకిస్తాన్ ఎదుట నిర్దేశించిన 343 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో పాక్.. ఇక పదిహేను నిమిషాల ఆట ముగుస్తుందనే వరకూ పోరాడింది.

‘బజ్ బాల్’.. తమ టెస్టు క్రికెట్ ఆటకు ఇంగ్లాండ్ పెట్టుకున్న పేరు ఇది . బజ్ బాల్ అంటే అందులో పెద్ద రహస్యమేమీ లేదు. దూకుడుగా ఆడటం. టెస్టు క్రికెట్ ను కూడా పరిమిత ఓవర్ల మాదిరిగా రసవత్తరంగా మార్చడం. ఈ ఏడాది జూన్ లో జో రూట్ ను సారథిగా తప్పించి బెన్ స్టోక్స్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాక ఇంగ్లాండ్ ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నది. టెస్టులలో కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ - బెన్ స్టోక్స్ జంట ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అదిరిపోయే ఫలితాలను రాబడుతోంది. తాజాగా పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. రావల్పిండి టెస్టులో కూడా చేసిందిదే. బజ్ బాల్ గేమ్ తో పాకిస్తాన్ కు స్వదేశంలో చుక్కలు చూపించింది. టెస్టు క్రికెట్ ను ఇలా కూడా ఆడొచ్చని పాకిస్తానీలకు పరిచయం చేసింది.
రావల్పిండి వేదికగా ముగిసిన తొలి టెస్టు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఎదుట నిర్దేశించిన 343 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో పాక్.. చివరి వరకూ పోరాడి ఓడింది. ఇక పదిహేను నిమిషాల ఆట ముగుస్తుందనే వరకూ పోరాడింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం నమ్మకం కోల్పోకుండా సంచలన ఆటతీరుతో విజయాన్ని అందుకుంది.
343 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 268 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కూడా ఓ క్రమంలో విజయం కోసం పోరాడింది. ఆట నాలుగో రోజు గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన అజర్ అలీ, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, అగా సల్మాన్ లతో పాటు చివర్లో నసీమ్ షా, మహ్మద్ అలీ కూడా కడదాకా పోరాడారు. లంచ్ తర్వాత టీ టైమ్ వరకు పాక్ రేసులోకి వచ్చింది. కానీ టీ తర్వాత అంతా తలకిందులు..
టీ తర్వాత..
ఆట ఐదో రోజు ఇమామ్ ఉల్ హక్ (48), సౌద్ షకీల్ (76) లతో పాటు రిజ్వాన్ (46), అగా సల్మాన్ (30) లు పోరాడారు. టీ వరకు పాకిస్తాన్ మరో సెషన్ లో 85 పరుగులు చేస్తే చాలు. కానీ టీ తర్వాత అంతా మారిపోయింది. అగా సల్మాన్ ను ఔట్ చేసి రాబిన్సన్ ఇంగ్లాండ్ ను పోటీలోకి తెచ్చాడు. అదే రాబిన్సన్.. అజార్ అలీని కూడా పెవిలియన్ కు పంపాడు. తర్వాత అండర్సన్ జహీద్ మహ్మద్ ను, హరీస్ రౌఫ్ లను ఔట్ చేశాడు. అయితే చివర్లో నసీమ్ షా.. 46 బంతుల్లో 6 రన్స్, మహ్మద్ అలీ 26 బంతుల్లో 0 నాటౌట్ పాకిస్తాన్ ను కాపాడేందుకు చివరివరకూ పోరాడారు. అయితే ఆట మరో 15 నిమిషాల్లో ముగుస్తుందనగా జాక్ లీచ్.. నసీమ్ షా ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. అంతే ఇంగ్లాండ్ సంచలన విజయం.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ లో 657 ఆలౌట్
పాకిస్తాన్ : తొలి ఇన్నింగ్స్ లో 579 ఆలౌట్
ఇంగ్లాండ్ : రెండో ఇన్నింగ్స్ లో 264 -7 డిక్లేర్డ్ (పాక్ ఎదుట 343 పరుగుల లక్ష్యం)
పాకిస్తాన్ : రెండో ఇన్నింగ్స్ లో 268 ఆలౌట్
ఫలితం : 74 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం