PAK vs ENG T20I: రాక రాక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. తమ ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్ మరోసారి మిడిలార్డర్ వైఫల్యంతో దెబ్బతింది.

ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓడిన ఓటమి నుంచి పాకిస్తాన్ ఇంకా బయటకు రాలేదు. రాక రాక తమ దేశానికి పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తో కరాచీ వేదికగా ముగిసిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు పేలవ ప్రదర్శనతో మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు జట్టు సారథి బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 31, 3 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో 68, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 9 ఓవర్లలోనే 85 పరుగులు జోడించారు. కానీ అదిల్ రషీద్ ఈ జోడీని విడదీశాడు. బాబర్ ను అతడు బౌల్డ్ చేయడంతో పాకిస్తాన్ పతనం ప్రారంభమైంది. 

బాబర్ నిష్క్రమించాక హైదర్ అలీ (11), షాన్ మసూద్ (7), మహ్మద్ నవాజ్ (4), ఖుష్దిల్ (5) లు అలా వచ్చి ఇలా వెళ్లారు . ఇఫ్తికార్ అహ్మద్ (28) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లూక్ వుడ్ 3 వికెట్లు తీయగా.. అదిల్ రషీద్ రెండు, కెప్టెన్ మోయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. 

Scroll to load tweet…

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (10) మూడో ఓవర్లోనే నిష్క్రమించాడు. కానీ అలెక్స్ హేల్స్ (53), డేవిడ్ మలన్ (20), బెన్ డకెట్ (21) లతో కలిసి ఇంగ్లాండ్ ను ఆదుకున్నాడు. చివర్లో హ్యారీ బ్రూక్ (25 బంతుల్లో 42 నాటౌట్, 7 ఫోర్లు) వీరవిహారం చేసి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గురువారం ఇదే వేదికమీద జరగనుంది. 

Scroll to load tweet…