ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. ద్వైపాక్షిక సిరీస్ కారణంగా ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ సెషన్స్‌కి హాజరు కాని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా దుబాయ్‌లో వాలిపోయారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ సెప్టెంబర్ 16న ముగిసింది. ఒక్క రోజు గ్యాప్‌లో ఇరు దేశాలకు చెందిన 21 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కోసం దుబాయ్ చేరిపోయారు.

అయితే కరోనా నిబంధనల కారణంగా దుబాయ్ చేరిన ఈ ప్లేయర్లకు 36 గంటల పాటు క్వారంటైన్‌ పీరియడ్ ఉంటుంది. ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు అనుమతిస్తారు. అంటే మరో మూడు రోజుల పాటు ఈ ఆటగాళ్లు జట్టుతో కలిసే అవకాశం ఉండకపోవచ్చు.

 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఓపెనర్ జానీ బెయిర్ స్టో కూడా 16 వరకూ ఇంగ్లాండ్‌లో మ్యాచుల్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ ఇద్దరూ లేకుండానే మొదటి మ్యాచ్ ఆడనుంది ఎస్ఆర్‌హెచ్.

అలాగే కోల్‌కత్తా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఇయాన్ మోర్గాన్, పాట్ కమ్మిన్స్, టామ్ బంటన్... రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, ఆండ్రూ టై, చెన్నై ఆటగాడు ఆరోన్ ఫించ్ తదితరులు దుబాయ్ చేరుకున్నవారిలో ఉన్నారు.