ఐసిసి ప్రపంచ కప్ సాధించాలన్నది ప్రతి క్రికెట్ జట్టు కోరిక. అయితే కొన్ని దేశాలు ఇప్పటికే ఆ కలను నెరవేర్చుకోగా మరికొన్ని దేశాలకు అదో అందరి ద్రాక్షగా మిగిలిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆటగాళ్లు కలిగి బలమైన జట్లుగా పేరున్న కొన్ని జట్లు ఇప్పటికీ ఈ ట్రోఫీని అందుకోలేకపోయాయి. అలాంటి వాటిల్లో న్యూజిలాండ్ జట్టు ఒకటి. 

అయితే ఇటీవల జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో కివీస్ కేవలం ఒక్క అడుగు దూరంలో ట్రోఫీని కోల్పోయింది. ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవాలన్న ఆ జట్టు చిరకాల వాంఛను ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అడ్డుకున్నాడు. అలా స్వదేశాన్ని ఓడించిన ఆటగాడే తాజాగా ''న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'' కు నామినేట్ అయ్యాడు. 

స్టోక్స్ ను ఎందుకు నామినేట్ చేశారంటే

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ సొంత దేశం న్యూజిలాండ్. అయితే స్టోక్స్ చిన్నపుడే తండ్రి గెరార్డ్ ఇంగ్లాండ్ కు వలవెల్లాడు. రగ్బీ క్రీడాకారుడైన అతడు తన కొడుకుని మాత్రం క్రికెటర్ చేశాడు. ఇలా తన అత్యుత్తమ ఆటతీరుతో స్టోక్స్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం తిరిగి  న్యూజిలాండ్ కు వెళ్లిపోయి అక్కడే నివసిస్తున్నారు. 

ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు తలపడ్డాయి. కీలకమైన  ఈ మ్యాచ్ లో స్టోక్స్(84 పరుగులు) అద్భుతంగా రాణించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ ను గెలిపించి...పుట్టి పెరిగిన న్యూజిలాండ్ ను ఓడించాడు. ఇలా వరుసగా రెండో సారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్న కివీస్ తమ జాతీయుడి చేతుల్లోనే ఓటమిని  చవిచూసింది. 

అయితే తమ దేశ ఓటమికి కారణమైన ఆటగాన్నే కివీస్ న్యూజిలాండర్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు నామినేట్‌ చేసింది. స్టోక్స్ తో పాటు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెన్ విలియమ్సన్ ను కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.  ఈ అవార్డు కోసం పదిమందిని నామినేట్ చేసి వారిలో ఒక్కరికి దాన్ని ప్రదానం చేస్తారు. అయితే ఈ అవార్డు గెలుచుకున్నది ఎవరో మాత్రం  వచ్చే ఏడాది ఆరంభంలో తెలుస్తుంది.