The Ashes 2021-22: యాషెస్ సిరీస్ లో గురువారం నుంచి ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మొదలుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్రాక్టీస్ జోరు పెంచింది. ఈ క్రమంలో  టెస్టు జట్టు సారథి జో రూట్ తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  

యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. ఇటీవలే ముగిసిన బ్రిస్బేన్ టెస్టులో దారుణ పరాజయం పాలై విమర్శల పాలైంది. దీంతో రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న ఆ జట్టు ప్రాక్టీస్ లో శ్రమిస్తున్నది. అడిలైడ్ వేదికగా గురువారం (డిసెంబర్ 16) నుంచి రెండో టెస్టు (డే అండ్ నైట్) మొదలుకావాల్సి ఉంది. ఇందులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆ జట్టు భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్రాక్టీస్ జోరు పెంచింది. ఈ క్రమంలో టెస్టు జట్టు సారథి జో రూట్ తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, రూట్ కు బౌన్సర్ విసిరాడు. స్పీడ్ గా దూసుకొచ్చిన ఆ బౌన్సర్ సరాసరి వచ్చి రూట తలకు బలంగా తగిలింది. అయితే ఆ సమయంలో అతడికి హెల్మెట్ ఉండటంతో రూట్ కు భారీ ప్రమాదం తప్పింది. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బౌన్సర్ గనుక తాకినప్పుడు రూట్ కు హెల్మెట్ లేకుంటే భారీ ప్రమాదమే జరిగేది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

Scroll to load tweet…

అయితే బెన్ స్టోక్స్ వేసిన బౌన్సర్.. తలకు బలంగా తగిలినా రూట్ మాత్రం ప్రాక్టీస్ సెషన్ కొనసాగించాడు. జట్టు సహచరులంతా నెట్స్ ను వీడినా తాను మాత్రం అక్కడే ఉండి ప్రాక్టీస్ ను పెంచాడు. గొప్ప ఆటగాడిగా గుర్తింపు అందుకుంటున్న జో రూట్.. స్వదేశంలో సెంచరీల మోత మోగిస్తున్నా, ఇతర దేశాలలో కూడా శతకాల జోరు కొనసాగిస్తున్నా ఇంతవరకు ఆసీస్ గడ్డ మీద టెస్టుల్లో సెంచరీ చేయలేదు. 

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీకి దగ్గరగా (89) వచ్చినా దానిని మూడంకెల స్కోరుగా మలచలేక చతికిలపడ్డాడు. దీంతో అడిలైడ్ లో జరిగే రెండో టెస్టులో అయినా ఆ అపప్రదను తొలగించుకోవాలని రూట్ భావిస్తున్నాడు. అందుకే నెట్స్ లో విరామమెరుగక శ్రమిస్తున్నాడు. 

Scroll to load tweet…

రూట్ తో పాటు తొలి టెస్టులో బౌలింగ్ వేసేప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న్ బెన్ స్టోక్స్ కూడా నెట్స్ లో తీవ్రంగాశ్రమించాడు. గాయం కారణంగా సుమారు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న స్టోక్స్.. ఇంకా పాత లయను అందుకోలేదు. గబ్బా టెస్టులో బెన్ స్టోక్స్ గతి తప్పి విసిరిన నోబాల్స్ చర్చనీయాంశమయ్యాయి. అంతేగాక గబ్బా టెస్టులో అతడు మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు.

ఈ నేపథ్యంలో బెన్ రెండో టెస్టులో ఆడుతాడా.? లేదా..? అని అనుమానాలు తలెత్తాయి. అయితే నెట్స్ లో స్టోక్స్ బౌలింగ్ చేసిన తీరు చూస్తే మాత్రం అతడు ఫిట్ గానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని అతడు ఈసీబీకి తెలిపాడు. ఇక గాయాలతో తొలి టెస్టుకు దూరమైన ఆ జట్టు పేస్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లు అడిలైడ్ లో ఆడనుండటం ఇంగ్లాండ్ కు కలిసొచ్చేదే. మరోవైపు తొలి టెస్టులో గాయపడ్డ ఆసీస్ ఆటగాళ్లు జోష్ హెజిల్వుడ్, డేవిడ్ వార్నర్ లు రెండో టెస్టులో బెంచ్ కే పరిమితం కానున్నారు. హెజిల్వుడ్ స్థానంలో జై రిచర్డ్సన్ ఆడే అవకాశముంది.