Asianet News TeluguAsianet News Telugu

డార్ల్ మిచెల్ ‘హ్యాట్రిక్’ సెంచరీ... టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి న్యూజిలాండ్ బ్యాటర్‌గా...

ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా మూడో టెస్టులోనూ సెంచరీ బాదిన డార్ల్ మిచెల్... హ్యాట్రిక్ సెంచరీలతో 73 ఏళ్ల నాటి రికార్డులు బ్రేక్...

ENG vs NZ: Daryl Mitchell becomes the first NZ batter to have score 3 consecutive Test Hundreds
Author
India, First Published Jun 24, 2022, 6:16 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డార్ల్ మిచెల్ శతకాల మోత మోగిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో శతకాలు నమోదు చేసిన డార్ల్ మిచెల్, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు. లీడ్స్‌లోని హెడ్డింగ్‌లేలో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు, రెండో రోజు లంచ్ విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది...

టామ్ లాథమ్ ఆరు బంతులాడి డకౌట్ కావడంతో మొదటి ఓవర్‌లో పరుగులేమీ చేయకుండానే వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. విల్ యంగ్ 42 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ కాగా కరోనా నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 64 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేశాడు..

డివాన్ కాన్వే 62 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేయగా హెన్రీ నికోలస్ 99 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేశాడు. ఒకానొక దశలో 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది న్యూజిలాండ్. ఈ దశలో టామ్ బ్లండెల్‌తో కలిసి ఆరో వికెట్‌కి 120 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి, కివీస్‌ను ఆదుకున్నాడు డార్ల్ మిచెల్. 

122 బంతుల్లో 7 ఫోర్లతో 55 పరుగులు చేసిన టామ్ బ్లండెల్‌ను మ్యాట్ పాట్స్ అవుట్ చేయగా 46 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మిచెల్ బ్రేస్‌వెల్‌ని స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో టిమ్ సౌథీతో కలిసి 8వ వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు డార్ల్ మిచెల్...

228 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న డార్ల్ మిచెల్, వరుసగా మూడు టెస్టుల్లో శతకాలు నమోదు చేసిన మొట్టమొదటి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ మార్కును అందుకున్న డార్ల్ మిచెల్.. 73 ఏళ్ల చరిత్రలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో 400+ పరుగులు చేసిన మొట్టమొదటి కివీస్ బ్యాటర్‌గా నిలిచాడు.  

లార్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే అవుటైన డార్ల్ మిచెల్, రెండో ఇన్నింగ్స్‌లో 203 బంతుల్లో 108 పరుగులు చేశాడు. నాటింగ్‌హమ్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 318 బంతుల్లో 190 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు...

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 284 పరుగులకి ఆలౌట్ అయితే డార్ల్ మిచెల్ 131 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 109 పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌, జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ అవుటైన తర్వాత లంచ్ బ్రేక్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించారు అంపైర్లు. టిమ్ సౌథీ 27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన ఇంగ్లాండ్ సిరీస్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకుంది...

Follow Us:
Download App:
  • android
  • ios