Asianet News TeluguAsianet News Telugu

ENG vs IND: తడబడి నిలబడిన భారత్.. రిషభ్ పంత్ సూపర్ సెంచరీ..

England vs India: ఎడ్జబాస్టన్ టెస్టులో భారత జట్టు తడబడి నిలబడింది. తొలుత త్వరత్వరగా వికెట్లు పడిపోయినా ఆపై నిలదొక్కుకుంది.  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  సెంచరీ చేశాడు. 

ENG vs IND: Team India Steady After Early Blows, Rishabh pant and Ravindra jadeja Going Strong
Author
India, First Published Jul 1, 2022, 10:39 PM IST

ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తడబడి నిలబడింది. ఒకదశలో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో అసలు 200 స్కోరు అయినా  చేస్తారా..? అన్న స్థితి నుంచి మెరుగైన స్కోరు దిశగా సాగుతున్నది. టీమిండియా వికెట్ కీపర్  రిషభ్ పంత్ (101 బంతుల్లో 130 నాటౌట్.. 18 ఫోర్లు, 3 సిక్సర్లు)  కీలక సమయంలో సెంచరీతో ఆదుకున్నాడు. అతడికి తోడుగా  రవీంద్ర జడేజా (128 బంతుల్లో 55.. 7 ఫోర్లు)  కూడా రాణించడంతో భారత జట్టు.. 63 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి అభేద్యమైన ఆరో వికెట్ కు ఇప్పటికే 197 పరుగులు జోడించారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఇంగ్లాండ్ బౌలర్లు షాకుల మీద షాకులిచ్చారు. ఓపెనర్లు శుభమన్ గిల్ (17), పుజారా (13) తో పాటు టాపార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లి (11), హనుమా విహారి (20), శ్రేయస్ అయ్యర్ (11) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో భారత జట్టు 27.5 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. 

ఆదుకున్న రిషభ్-జడేజా 

లంచ్ కు ముందే వరుణుడు ఆటకు అంతరాయం కలిగించడంతో కాసేపు నిలిచిపోయిన ఆట తిరిగి కాసేపటికి మళ్లీ ప్రారంభమైంది. అయితే లంచ్ తర్వాత భారత జట్టు వరుసగా విహారి, కోహ్లి, అయ్యర్ వికెట్లు కోల్పోవడంతో భారత్ ను  ఆదుకోవాల్సిన బాధ్యత రిషభ్ పంత్, రవీంద్ర జడేజా ల మీద పడింది.  వర్షం తర్వాత కొద్దిసేపు ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోవడంతో బంతిని గమనిస్తూ నిదానంగా ఆడారు ఈ ఇద్దరు బ్యాటర్లు.  కానీ క్రీజులో కుదురకున్నాక  స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా పంత్.. జాక్ లీచ్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. 36వ ఓవర్లో 4,4,6 బాదాడు. అతడే వేసిన  42.5 ఓవర్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  అప్పటిదాకా నెమ్మదిగా, పంత్ కు సహకరించిన జడ్డూ కూడా తర్వాత  ఫోర్లు బాదాడు. 

 

మాథ్యూ పాట్స్ వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్  లో తొలి బంతికి ఫోర్ కొట్టడం ద్వారా పంత్.. టెస్టులలో 2వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.  హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచిన పంత్..  స్టువర్ట్ బ్రాడ్ వేసిన  57.1 ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 89 బంతుల్లోనే అతడు సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. టెస్టులలో అతడికి ఇది ఐదో సెంచరీ.  అదే ఓవర్లో జడ్డూ కూడా  నాలుగో బంతిని  సింగిల్ తీయడం ద్వారా జడేజా తన టెస్టు కెరీర్ లో  18వ అర్థ సెంచరీ సాధించాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios