Asianet News TeluguAsianet News Telugu

Rakesh Jhunjhunwala: ఒక శకం ముగిసింది.. ఝున్‌ఝున్‌‌వాలాకు సెహ్వాగ్ నివాళి

Rakesh Jhunjhunwala Passes Away: భారతీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా  మృతిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాళి అర్పించాడు. 
 

End Of an Era: Virender Sehwag Mourns Rakesh Jhunjhunwala's Demise
Author
First Published Aug 14, 2022, 11:10 AM IST

‘ఇండియన్ వారెన్ బఫెట్’గా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ  స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఆయన ఆదివారం శాశ్వత నిద్రలోకి వెళ్లారు. దేశీయ స్టాక్ మార్కెట్ ను మకుటం లేని మహారాజుగా ఏలిన ఝున్‌ఝున్‌‌వాలా  మృతిపై టీమిండియా  మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాళి అర్పించాడు. ఝున్‌ఝున్‌‌వాలా మరణించడంతో ‘ఒక శకం ముగిసింది’ అని పేర్కొన్నాడు.

ఝున్‌ఝున్‌‌వాలా మృతిపై వీరూ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘దలాల్ స్ట్రీట్ లో బిగ్ బుల్ గా పేరొందిన  రాకేశ్ ఝున్‌ఝున్‌‌వాలా  మరణించడంతో  ఒక శకం ముగిసినట్టైంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. 

1960, జులై5న హైదరాబాద్‌లో జన్మించిన ఝున్‌ఝున్‌‌వాలా పూర్వీకులది రాజస్తాన్. మార్వాడీ కుటుంబానికి చెందిన రాకేశ‌్‌కు చిన్ననాటి నుంచే వ్యాపారం మీద అమితాసక్తి.  ఝున్‌ఝున్‌‌వాలా తండ్రి పన్నుల శాఖలో  ఉద్యోగి.  ఉద్యోగరీత్యా ఆయన ఇక్కడ ఉన్నప్పుడే ఝున్‌ఝున్‌‌వాలా జన్మించారు. కానీ రాకేశ్‌కు రెండేండ్ల వయసున్నప్పుడే వాళ్ల కుటుంబం ముంబైకి వెళ్లింది. చిన్ననాటి నుంచే వ్యాపారం మీద ఆసక్తి ఉన్న ఆయన..  17 ఏండ్ల వయసులోనే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. స్టాక్ మార్కెట్ రిస్క్ తో కూడుకున్నది అని వాళ్ల నాన్న చెప్పినా వినకుండా ఆయన దీనినే స్టాక్ మార్కెట్ నే తన కెరీర్ గా ఎంచుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్టాక్ మార్కెట్ ను మకుటం లేని మహారాజుగా ఏలారు.  

 

ఇక, ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడిదారుడిగానే కాకుండా.. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్నారు. పలు భారతీయ సంస్థలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ వినయ్ దూబే కలిసి Akasa Airను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రస్తుతం 2 విమానాలు ఉన్నాయి. మరో 70 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆగస్టు 9 నాటికి Akasa Air మూడు నగరాలకు విమాన సేవలు అందిస్తున్నది.  

 

ఝున్‌ఝున్‌వాలా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఝున్‌ఝున్‌వాలా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ పురోగతిపై ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios