Elena Rybakina: వింబూల్డన్-2022 మహిళల సింగిల్స్ విజేత ఎలీనా  రిబాకినా  రష్యాలో పుట్టినప్పటికీ ఆమె ఈ టోర్నీలో మాత్రం కజకిస్తాన్ తరఫున ఆడింది. 

తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్  గెలిచిన  రష్యా అమ్మాయి  ఎలీనా రిబాకినా  తాను కజకిస్తాన్  అమ్మాయినని.. ఆ దేశ ప్రజలు తనమీద చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేదని  భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. తన తల్లిదండ్రులు మాస్కోలో ఉంటున్నప్పటికీ తనకు గత నాలుగేండ్లుగా కజకిస్తాన్ అండగా నిలిచిందని తెలిపింది. వింబూల్డన్  ఫైనల్ లో ట్యూనీషియాకు చెందిన ఆన్స్ జబేర్ ను ఓడించిన తర్వాత ఆమె విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పాత్రికేయుల సమావేశం సందర్భంగా రిబాకినాకు.. ‘మీ తల్లిదండ్రులు మాస్కోలో ఉంటున్నారు కదా.. మీరు వింబూల్డన్ గెలిచాక వాళ్ల ఫీలింగ్ ఏంటి..?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెబుతూ రిబాకినా ఏడ్చేసింది. 

‘బహుశా వాళ్లు చాలా గర్వపడతారు..’ అని సమాధానం చెబుతూనే ఎమోషనల్ అయింది. తర్వాత కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘మీరు నాలో ఎమోషన్ ను చూడాలనుకుంటున్నారా.. నేను దానిని చాలా రోజులు దాచుకున్నాను’ అంటూ  చెప్పడంతో అక్కడ  నవ్వులు విరబూశాయి.  

 

Scroll to load tweet…

మాస్కోలో పుట్టిన 23 ఏండ్ల రిబాకినా 2018 నుంచి  కజకిస్తాన్ తరఫున ఆడుతున్నది. అయితే ఆమె కజకిస్తాన్ తరఫున గెలిచినా రష్యా మీడియా మాత్రం  రిబాకినాను తమ దేశానికి చెందిన విజేతగానే  కీర్తిస్తున్నది. ఇదే విషయమై రష్యా టెన్నిస్ చీఫ్  తార్పిస్చేవ్ రష్యన్ న్యూస్ ఏజెన్సీ రియా నొవొస్తీ తో స్పందిస్తూ.. ‘వెల్ డన్ రిబాకినా. మేం (రష్యా) వింబూల్డన్ టోర్నీ గెలిచాం..’ అని కామెంట్ చేయడం గమనార్హం. ఇంతేగాక  రష్యాలోని పలు మీడియా సంస్థలు  మరో అడుగు ముందుకేసి  ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. రిబాకినాను అభినందించాడని,  వింబూల్డన్ గెలిచాక ఆమెతో మాట్లాడాడని కూడా కథనాలు వండివార్చాయి.  

కానీ రిబాకినా మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ పుట్టానో నాకు అవసరం లేదు. కజకిస్తాన్ ప్రజలు నాపై చాలా ప్రేమ చూపించారు. వాళ్ల మద్దతు నేను మరిచిపోలేనిది. గత నాలుగేండ్లుగా నేను ఆ దేశం తరఫున ఆడుతున్నాను. నేను ఎక్కడికెళ్లినా వాళ్లు నాకు మద్దతునిస్తున్నారు.  నేడు (వింబూల్డన్ ఫైనల్)  కూడా  కజకిస్తాన్ ఫ్లాగ్స్ తో వాళ్లు నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు.  కానీ మీరడుగుతున్న (రష్యా గురించి) ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు..’ అని తెలిపింది. 

రష్యన్ ప్రభుత్వం మీ విజయాన్ని తమ దేశపు విజయంగా మార్చుకోనుందా అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘అక్కడ (రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి) ఏం జరుగుతుందో నాకు తెలియదు.  టీవీలలో అందరిలాగే నేనూ వార్తలు చూస్తున్నా.  కానీ ఈ విషయంలో నేనేమీ చేయలేను.  నేను కజకిస్తాన్ కు చాలా కాలంగా ఆడుతున్నా.   పెద్ద టోర్నీలు, ఒలింపిక్స్ కు కూడా  నేను కజకిస్తాన్ అమ్మాయిగానే బరిలోకి దిగుతున్నా..’అని  చెప్పింది. 

 

Scroll to load tweet…

శనివారం ముగిసిన ఫైనల్ లో  రిబాకినా.. 3-6, 6-2, 6-2 తో జబేర్ ను ఓడించిన విషయం తెలిసిందే.  తొలి సెట్ లో ఓడినా రిబాకినా పట్టుదలగా ఆడి తర్వాత రెండు సెట్లలో  నెగ్గి తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకుంది.