‘ఈ సాలా కప్ నమ్దే’ అంటున్న డివిలియర్స్.. గట్టిగానే ప్లాన్ చేశావ్ మైక్.. కానీ కుదిరేపనేనా..?
IPL 2023: ఐపీఎల్ లో అత్యంత ప్రజాధరణ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఆ జట్టు స్లోగన్ ‘ప్లే బోల్డ్’ కంటే అభిమానులకు ‘ఈ సాలా కప్ నమ్దే’నే వారి నినాదమైపోయింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో నాలుగు రోజుల్లో 16వ ఎడిషన్ మొదలుకాబోతుంది. కరోనా తర్వాత మూడేండ్లకు ఐపీఎల్ లో మళ్లీ హోం అండ్ అవే మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సీజన్ ను కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి అన్ని ఫ్రాంచైజీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ లో అత్యంత ప్రజాధరణ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న ఆర్సీబీ ఓ అడుగు ముందే ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకూ కప్ కొట్టని జాబితాలో ఉన్న ఆర్సీబీ.. ఫ్యాన్స్ ను అలరించడంలో మాత్రం మిగతా జట్లతో పోలిస్తే కాస్త ముందే ఉంటుంది. తాజాగా ఆ జట్టు ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ పేరిట ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్సీబీ దిగ్గజ క్రికెటర్లతో పాటు వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఆర్సీబీ అభిమానులు ప్రతీ ఏడాది చెప్పుకునే ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే)ను అని ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘మీ అండతో ఆటగాళ్లు కప్ ను తీసుకొస్తారన్న నమ్మకం నాకుంది..’అని ఆ తర్వాత ‘ఈసాలా కప్ నమ్దే’ అని అనడంతో ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. అప్పుడు అదే వేదికపై ఉన్న క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తో పాటు ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్ కూడా చప్పట్లతో వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు.
వాస్తవానికి ఈ లీగ్ లో ఆర్సీబీ స్లోగన్ ‘ప్లే బోల్డ్’ అని ఉంటుంది. కానీ దీని గురించి ఎవరికి తెలిసినా తెలియకున్నా ఆర్సీబీ అంటేనే ‘ఈ సాలా కప్ నమ్దే’అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతాయి. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఒక్కసారి కూడా కప్ కొట్టలేని నిస్సహాయత ఆర్సీబీ సొంతం.
అయితే డివిలియర్స్ వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘గట్టిగానే ప్లాన్ చేశావ్ మైక్.. క్రిస్ గేల్, నువ్వు (డివిలియర్స్), కోహ్లీ వంటి దిగ్గజాలు ఉన్నప్పుడే కానిది.. ఇప్పుడు అయ్యే పనే అంటావా..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం ఏబీడి కామెంట్స్ పై ఖుషీ అవుతున్నారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి మెంటార్ (?) గా ఉండనున్న డివిలియర్స్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని, అందుకే ఈ కామెంట్స్ చేశాడని చెప్పుకుంటున్నారు.
కాగా ఆర్సీబీకి చాలాకాలం పాటు ఆడిన క్రిస్ గేల్, ఏబీడి జెర్సీ నెంబర్లు (333, 17) జట్టు వద్దే ఉండేలా వాటికి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ జెర్సీలను మరెవరూ వాడకుండా చర్యలు తీసుకుంటున్నది. ఐపీఎల్ లో మరే ఫ్రాంచైజీ చేయని విధంగా ఈ ఇద్దరికీ ‘ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది.