Asianet News TeluguAsianet News Telugu

పోలార్డ్ బాటలోనే డీజే బ్రావో... ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్! వెంటనే సీఎస్‌కే బౌలింగ్ కోచ్‌గా...

ఐపీఎల్‌లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న డీజే బ్రావో... సీఎస్‌కే రిటెన్షన్‌లో చోటు దక్కించుకోని బ్రావో! మినీ వేలానికి ముందు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన... బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్న సీఎస్‌కే.. 

Dwayne Bravo appointed as the bowling coach of CSK in IPL 2023 after retirement
Author
First Published Dec 2, 2022, 3:18 PM IST

వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డీజే బ్రావో, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్ల తరుపున ఆడిన డ్వేన్ బ్రావో, 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. సీఎస్‌కే‌పై బ్యాన్ పడిన రెండేళ్లు గుజరాత్ లయన్స్ టీమ్‌కి ఆడాడు...


మహేంద్ర సింగ్ ధోనీ విశ్వాసాన్ని చురుగొన్న ప్లేయర్లలో ఒక్కడైన డ్వేన్ బ్రావో, ఐపీఎల్ 2023 రిటెన్షన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్రావోని రూ.4.40 కోట్లకు తిరిగి దక్కించుకున్న సీఎస్‌కే, 2018 సీజన్ నుంచి 2021 వరకూ ఏటా రూ.6 కోట్ల 40 లక్షలు అందుకున్నాడు...

ఐపీఎల్ కెరీర్‌లో 161 మ్యాచులు ఆడిన డీజే బ్రావో, 158 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లసిత్ మలింగ్ రికార్డును బ్రేక్ చేశాడు డ్వేన్ బ్రావో...

చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్‌లో బ్రావో పేరు కనిపించకపోవడం, ఆ తర్వాత వేలానికి ఈ విండీస్ ఆల్‌రౌండర్ పేరు రిజిస్టర్ చేయించుకోకపోవడంతో రిటైర్మెంట్‌పై అనుమానాలు రేగాయి. తాజాగా అధికారికంగా ఐపీఎల్ నుంచి ప్లేయర్‌గా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు డీజే బ్రావో..

ఆటగాడిగా తప్పుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన రాగానే బ్రావోని, బౌలింగ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 140 మ్యాచులు ఆడిన బ్రావో, బ్యాటుతోనూ రాణించి 1560 పరుగులు చేశాడు. 

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది బాలాజీ అందుబాటులో ఉండడం లేదు. దీంతో బాలాజీ ప్లేస్‌లో బ్రావో ఆ బాధ్యతలు చేపట్టబోతున్నాడు..

‘సీఎస్‌కేతో నా అనుబంధం వీడదీయరానిది. కొత్త ప్రయణాన్ని మొదలెట్టడానికి ఆశగా ఎదురుచూస్తున్నా. బౌలర్లతో కలిసి పనిచేయడం భలే మజాగా ఉంటుంది. ప్లేయర్ నుంచి కోచ్‌గా మారినా వారితో నాకున్న స్నేహం చెడిపోదు. ఐపీఎల్‌ ఆడడం మొదలెట్టినప్పుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తానని అస్సలు ఊహించలేదు. ఏ టార్గెట్ లేకుండా ఐపీఎల్‌లోకి వచ్చా... ఇక్కడ ఆగినన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశా.. కోచ్‌గా కూడా అలాంటి ఎంజాయ్‌మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు డ్వేన్ బ్రావో...

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో కిరన్ పోలార్డ్‌కి దక్కకపోవడం, వేరే ఫ్రాంఛైజీకి ఆడడం ఇష్టం లేదని అతను రిటైర్మెంట్ ప్రకటించడం... వెంటనే తనను ముంబై బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్టు ఫ్రాంఛైజీ ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. పోలార్డ్‌తో టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ విషయంలో పోటీపడే బ్రావోకి కూడా ఇదే రకమైన అనుభవం ఎదురైంది...

Follow Us:
Download App:
  • android
  • ios