రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్... లీగ్‌లపై ఫోకస్ పెట్టేందుకేనంటూ...
33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్... టీ20 లీగ్స్, ఫ్యామిలీకి సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన..
టీ20 క్రికెట్ వచ్చాక వన్డేలకు ఆదరణ తగ్గింది. ఫ్రాంఛైజీ క్రికెట్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి కూడా ఆదరణ తగ్గుతోంది. అభిమానులే కాదు, చాలామంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకంటే ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కిరన్ పోలార్డ్ వంటి ప్లేయర్లు, దేశానికి ఆడిన మ్యాచుల కంటే ఫ్రాంఛైజీలకు ఆడిన మ్యాచుల సంఖ్యే ఎక్కువ...
న్యూజిలాండ్ క్రికెటర్లు జేమ్స్ నీశమ్, ట్రెంట్ బౌల్డ్, మార్టిన్ గుప్టిల్ కూడా ఫ్రాంఛైజీల క్రికెట్‌కి అందుబాటులో ఉండేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్, ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...
2016లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన డ్వైన్ ప్రిటోరియస్, దక్షిణాఫ్రికా తరుపున 3 టెస్టులు, 27 వన్డేలు, 30 టీ20 మ్యాచులు ఆడాడు. బ్యాటుతో రెండు హాఫ్ సెంచరీలు చేసిన డ్వైన్ ప్రిటోరియస్, బౌలింగ్‌లో 77 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన జట్టులో చోటు దక్కించుకున్న డ్వైన్ ప్రిటోరియస్... గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు...
కిస్తాన్‌పై టీ20లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి... సౌతాఫ్రికా తరుపున టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచిన డ్వైన్ ప్రిటోరియస్, 33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు...
‘నేను నా కెరీర్ ఆసాంతం టీ20, మిగిలిన పొట్టి ఫార్మాట్లపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే ఫ్రీ ఏజెంట్‌లా నాకు నచ్చిన ఫార్మాట్‌లో ఆడొచ్చు. అంతేకాకుండా నా కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలని అనుకుంటున్నా.. ’ అంటూ సౌతాప్రికా క్రికెట్ బోర్డుకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చాడు డ్వైన్ ప్రిటోరియస్...
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న డ్వైన్ ప్రిటోరియస్, ది హండ్రెడ్ లీగ్‌లో వెల్స్ ఫైర్ తరుపున ఆడుతున్నాడు. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లీగులో సెయింట్ కిట్స్ అండ్ నేవిట్ పిట్రిరాట్స్ తరుపున ఆడుతున్న డ్వైన్ ప్రిటోరియస్.. త్వరలో ప్రారంభం కాబోయే సౌతాఫ్రికా20 లీగ్‌లో దర్భన్ సూపర్ జెయింట్స్ తరుపున ఆడబోతున్నాడు..
అక్టోబర్‌లో టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్ డ్వైన్ ప్రిటోరియస్‌కి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.