Asianet News TeluguAsianet News Telugu

బౌన్సర్ తగిలి కిందపడిన వెంకటేశ్ అయ్యర్‌, అంబులెన్స్‌లో బయటికి... దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో...

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి తీవ్ర గాయం... అంబులెన్స్‌లో క్రీజు నుంచి బయటికి వెళ్లిన ఆల్‌రౌండర్... 

Duleep Trophy 2022: Venkatesh Iyer injured, Prithvi Shaw scores century
Author
First Published Sep 16, 2022, 5:33 PM IST

సగం ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి వచ్చి, హార్ధిక్ పాండ్యా సూపర్బ్ కమ్‌బ్యాక్‌తో జట్టులో చోటు కోల్పోయాడు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. కేకేఆర్ తరుపున అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్‌ని టీమిండియా సరిగ్గా వాడుకోలేదని వాదనలు వినిపించాయి. ఇచ్చిన అవకాశాలను అయ్యర్ సరిగ్గా వాడుకోలేకపోయాడనేవాళ్లు ఉన్నారు...

టీమిండియాలో చోటు కోల్పోయిన వెంకటేశ్ అయ్యర్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో బరిలో దిగుతున్నాడు. వెస్ట్ జోన్‌తో జరుగుతున్న  సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తరుపున ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. బౌలర్ చింతన్ గజా వేసిన ఓ బంతి, వెంకటేశ్ అయ్యర్ మెడకు బలంగా తాకింది. దీంతో గాయంతో విలవిలలాడిన వెంకటేశ్ అయ్యర్, రిటైర్డ్ హార్ట్‌గా క్రీజు వీడాడు. 

అంబులెన్స్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్రీజు బయటికి తీసుకెళ్లారు సిబ్బంది. కోయంబత్తూరులోని ఎస్‌ఎన్‌ఆర్ క్రికెట్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిందీ సంఘటన. అయితే చికిత్స తీసుకున్న అనంతరం వెంకటేశ్ అయ్యర్ తిరిగి బ్యాటింగ్‌కి వచ్చాడు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 85.4 ఓవర్లలో 257 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పృథ్వీ షా 78 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు చేసి అవుట్ కాగా యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ అజింకా రహానే 8 పరుగులు చేయగా రాహుల్ త్రిపాఠి 151 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేశాడు. శామ్స్ ములానీ 41, తనుష్ కొటియన్ 36 పరుగులు చేశారు.

కుమార్ కార్తీకేయ 5 వికెట్లు తీశాడు. అయితే  తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యష్ దూబే 4, హిమన్షు మంత్రి 11, శుభమ్ శర్మ 19 పరుగులు చేయగా కెప్టెన్ కరణ్ శర్మ 34 పరుగులు చేశాడు. ప్రియమ్ గార్గ్ 12, రింకూ సింగ్ 8, వెంకటేశ్ అయ్యర్ 14, కుమార కార్తీకేయ 4,రాజ్‌పుత్ 12, యాదవ్ 5 పరుగులు చేశారు. 

జయ్‌దేవ్ ఉనద్కడ్, తనుష్ కొటియన్ మూడేసి వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా సెంచరీతో చెలరేగాడు. యశస్వి జైస్వాల్ 3, అజింకా రహానే 12 పరుగులు చేసి అవుట్ కాగా రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. అయితే మరో ఎండ్‌లో పృథ్వీ షా మాత్రం క్రీజులో కుదురుకుపోయి బౌండరీల మోత మోగించాడు...

96 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన పృథ్వీ షా సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది వెస్ట్ జోన్. ఇందులో 104 పరుగులు కేవలం పృథ్వీ షా బ్యాటు నుంచి రావడం విశేషం.

నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో సౌత్ జోన్ భారీ స్కోరు చేసింది. రోహన్ కున్నుమ్మల్ 143, కెప్టెన్ హనుమ విహారి 134, రిక్కీ భుయ్ 103 పరుగులు చేసి సెంచరీలతో అదరగొట్టగా మయాంక్ అగర్వాల్ 49, బాబా ఇంద్రజిత్ 65, మనీశ్ పాండే 35, కృష్ణప్ప గౌతమ్ 48, రవితేజ 42 పరుగులు చేశారు. దీంతో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది సౌత్ జోన్..
 

Follow Us:
Download App:
  • android
  • ios