Drop-in Pitches In Pakistan: పాక్ లో క్రికెట్ నాణ్యతను పెంచడానికి ఆ దేశంలో డ్రాప్-ఇన్ పిచ్ లను ఏర్పాటు చేసేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.  ఇందుకోసమయ్యే ఖర్చును కూడా  పీసీబీ వెనుకాడటం లేదు.

పాకిస్తాన్ క్రికెట్ కు తిరిగి పాత రోజులు తీసుకురావాలని కంకణం కట్టుకున్న ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా.. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తున్నాడు. జాబితాలో ఎంతో మంది సీనియర్లున్నా.. తనను ఏరికోరి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గా నియమించినందుకు గాను ఆ దేశ ప్రధాని, తన మాజీ కెప్టెన్ ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వర్విస్తున్నాడు. ఇందులో భాగంగానే పాక్ లో క్రికెట్ నాణ్యతను పెంచడానికి ఆ దేశంలో డ్రాప్-ఇన్ పిచ్ లను ఏర్పాటు చేసేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది. ఇందుకోసమయ్యే ఖర్చును కూడా పీసీబీ వెనుకాడటం లేదు. రెండు వేదికల మీద ఏకంగా రూ. 37 కోట్లు ఖర్చు చేసి ఈ పిచ్ లను తయారు చేయనుంది. 

కరాచీ, లాహోర్ లలో డ్రాప్-ఇన్ పిచ్ లను ఏర్పాటు చేస్తామని రమీజ్ రాజా తెలిపాడు. ఈ మేరకు అరిఫ్ హబీబ్ గ్రూప్ తో పరస్పర ఒప్పందం (ఎంవోయూ) కూడా కుదుర్చుకున్నట్టు ఆయన చెప్పాడు. త్వరలో మొదలుకాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2021 లో భాగంగా ఈ పిచ్ లను ఉపయోగించే వీలుందని సమాచారం. రెండు పిచ్ ల కోసం రూ. 37 కోట్లు ఖర్చు చేస్తున్నామని రమీజ్ రాజా తెలిపాడు. 

అసలేంటి డ్రాప్-ఇన్ పిచ్ లు...? అవి ఎందుకు..?

మాములుగా పిచ్ లను గ్రౌండ్ లోనే రూపొందిస్తారు. ఆ దేశంలోని వాతావారణ పరిస్థితులు, స్వదేశ అవసరాలు, ఆ దేశంలో ఉన్న వనరుల (బౌలింగ్, బ్యాటింగ్) కు అనుకూలంగా ఉండేందుకు గాను క్యూరేటర్లు ఫిచ్ లను రూపొందిస్తారనేది ప్రపంచవ్యాప్తంగా బహిరంగ రహస్యమే. అయితే క్రికెట్ పిచ్ లు ఆసియాతో పోల్చితే.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ బౌన్సీ పిచ్ లను ఎక్కువగా రూపొందిస్తారు. 

కానీ ఉపఖండంలో మాత్రం ఇక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి అన్ని స్పిన్, బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, తాజాగా యూఏఈ లలో పిచ్ లు ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. దీంతో ఉపఖండపు జట్లు సౌతాఫ్రికా, ఆసీస్, కివీస్, ఇంగ్లాండ్ కు వెళ్లినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్లే కాదు.. బౌలర్లు కూడా ఆ పిచ్ లు ఎలా స్పందిస్తాయో తెలియక తేలిపోతున్నారు. దీంతో భారీ ఆశలతో విదేశాలకు వెళ్లడం.. ఉత్త చేతుల్తో తిరిగిరావడం సర్వ సాధారణమైంది. 

ఈ కష్టాల నుంచి గట్టెక్కించడానికే డ్రాప్-ఇన్ పిచ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు రమీజ్ రాజా చెప్పాడు. డ్రాప్-ఇన్ పిచ్ లను.. సంప్రదాయంగా చేస్తున్నట్టు గ్రౌండ్ లో చేయరు. వాటిని వేరే దగ్గర తయారు చేసి.. సదరు మ్యాచ్ ఆడే గ్రౌండ్ లో ఫిక్స్ చేస్తారు. వీటిలో స్లో, బౌన్సీ, స్పిన్, బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే విధంగా ఏ పిచ్ నైనా తయారుచేసుకోవచ్చు. 

Scroll to load tweet…

పెర్త్ లో అదే.. 

2018-19 లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు పెర్త్ లో జరిగిన రెండో టెస్టులో డ్రాప్-ఇన్ పిచ్ నే వాడారు. క్రికెట్ హిస్టరీలో మొదటిసారి డ్రాప్ ఇన్ పిచ్ ను వాడిన తొలి స్టేడియం కూడా పెర్త్ లోని వాకా స్టేడియమే. 

కరాచీ, లాహోర్ లలో అవే.. 

ఇక తాజాగా పాకిస్థాన్ లో ఏర్పాటు చేయనున్న డ్రాప్-ఇన్ పిచ్ లను బౌన్సీ పిచ్ లుగా రూపొందించాలని పీసీబీ నిర్ణయించింది. కరాచీలోని నయా నజిమాబాద్ క్రికెట్ స్టేడియంతో పాటు లాహోర్ లోని స్టేడియంలో కూడా ఈ రెండింటినీ ఏది ఏమైనా వచ్చే ఏడాది వరకు ఏర్పాటు చేయాలని సదరు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. ఇదే విషయమై రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘డ్రాప్-ఇన్ పిచ్ లు కచ్చితంగా పాకిస్థాన్ కు ఉపయోగపడుతాయి. దేశవాళీతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా దీనిమీద నిర్వహిస్తాం. చాలా కాలంగా ఆసీస్, కివీస్ లోని ఎక్స్ ట్రా బౌన్స్, పేస్ పిచెస్ మీద ఆడటంలో మా ఆటగాళ్లు తడబడుతున్నారు. ఈ కారణంగానే జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నా ఆ దేశాల్లో మేమింవతరకు టెస్టు సిరీస్ నెగ్గలేదు..’ అని అన్నాడు. 

వచ్చే ఏడాది ఆసీస్ లో టీ20 ప్రపంచకప్.. 

కాగా.. వచ్చే ఏడాది ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. అయితే అక్కడి పిచ్ లపై అలవాటు పడేందుకు వీలుగా పాకిస్థాన్ ఇప్పట్నుంచే ప్రణాళికలు మొదలుపెట్టిందనే వాదనలు వినబడుతున్నాయి.