Asianet News TeluguAsianet News Telugu

పాపం రోహిత్, కోహ్లీలను నిందించడం దేనికి..? ఇదంతా ధోని తప్పు.. అతడే కారకుడు..!

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లో ఓడిన తర్వాత  రోహిత్ సేన ఎలా కుంగిపోయిందో తెలియదు గానీ  ఫ్యాన్స్ మాత్రం  ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నారు.  గత కాలపు స్మృతులను తలుచుకుంటూ  ప్రస్తుత జట్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

Donot Blame Rohit and Virat, It was Dhoni Fault: Netizens Fires  on Indian Cricket Team
Author
First Published Nov 11, 2022, 6:02 PM IST

పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో దారుణ అవమానానికి గురై ఈసారి కూడా ఉత్తచేతులతోనే ఇంటిముఖం పట్టిన టీమిండియాపై సోషల్ మీడియాలో  నెటిజన్లు తమ ఫ్రస్ట్రేషన్  ను చూపెడుతున్నారు.  జట్టుగా విమర్శించడం కంటే సారథిపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు రోహిత్ శర్మ ను నేరుగానే విమర్శిస్తుంటే మరికొందరు.. రోహిత్, కోహ్లీ ల మధ్య  తేడాలను చూపుతూ వాటిని హైలైట్ చేస్తున్నారు. అయితే సీన్ లోకి కొత్తగా ధోని ఫ్యాన్స్ కూడా వచ్చారు. వీళ్ల కథ మరోలా ఉంది. వీళ్లు ఏకంగా.. రోహిత్, కోహ్లీలను నిందించడానికి ఏమీ లేదని, తప్పంతా ధోనిదే అంటున్నారు. ఏంటా కథ..? 

రోహిత్, కోహ్లీలు ధోని సారథ్యంలో భారత్ కు పరిచయమైనవారే. ఇద్దరి విజయాల్లో ధోని పాత్ర  సుస్పష్టమే. అయితే ధోని తర్వాత  టీమిండియా  పగ్గాలు కోహ్లీకి దక్కగా.. కోహ్లీ తర్వాత చాలా ఆలస్యంగా అవి   రోహిత్ కు దక్కాయి. ఇప్పుడు  ధోని ఫ్యాన్స్ బాధ ఏంటంటే.. 

ధోని సారథ్యంలో భారత జట్టు కీలక టోర్నీలలో నెగ్గింది. అసలు అంచనాలే లేని 2007 టీ20 ప్రపంచకప్ లో గెలిచి సంచలనం సృష్టించిన  ధోని సేన.. తర్వాత   2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2010లో ఆసియా కప్,  2016లో ఆసియా కప్ టీ20 టైటిల్ ను భారత్ కు అందించాడు. ధోని సారథ్యంలో భారత్ అప్రతీహాత విజయాలను అందుకుంది.  భారత క్రికెట్ లో ఇదొక స్వర్ణయుగం.  

 

కానీ ఆ తర్వాత కోహ్లీ చేతికి పగ్గాలు దక్కాయి. ద్వైపాక్షిక సిరీస్ లలో కోహ్లీ సేన రాణించినా ఐసీసీ ఈవెంట్లలో అట్టర్  ప్లాఫ్ అయింది. ఇప్పుడు  రోహిత్ కూడా  అదే చేశాడు. దీంతో  పలువురు ధోని అభిమానులు.. ‘పాపం  కోహ్లీ, రోహిత్ లను నిందించడం దేనికి..? అంత అవలీలగా  ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం మా ధోని చేసిన తప్పు..’, ‘ఐసీసీ ట్రోఫీలను ఏదో  పండగకు అత్తారింటికి వచ్చి  కట్న కానుకలు తీసుకెళ్లినంత ఈజీగా ధోని తీసుకెళ్లేవాడు.  అందరికీ అప్పుడు అది  అంత తేలికా అనిపించింది. కానీ ఇప్పుడు తెలుస్తుంది వాటి విలువ..’, ‘టీమిండియాను వరల్డ్ ఛాంపియన్ గా నిలపడం ధోని చేసిన తప్పు.  ఆ అంచనాలను అందుకోలేక కోహ్లీ, రోహిత్ చతికిలపడుతుంటే పాపం వీళ్లను నిందించడం దేనికి..?’ ‘జట్టు కోసం తన బ్యాటింగ్ స్థానాన్ని కూడా త్యాగం చేసినందుకు.. కోహ్లీ, రోహిత్ ల కోసం జట్టులో సీనియర్ ఆటగాళ్లను కూడా కాదన్నందుకు..  దేశం  ముందు మిగతావన్నీ తర్వాతే అని పోరాడినందుకు ధోనిని బాధ్యుడిని చేయాలి గానీ కోటానుకోట్ల సంపాదన మీద తప్ప  దేశం కోసం ఆడలేని ఆటగాళ్లను నిందించడం  ఎందుకు...?’ అని కామెంట్స్ చేస్తున్నారు.  

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios