భారత్‌లో క్రికెట్ ఒక మతమైతే.. సచిన్ దేవుడు. సుమారు మూడు దశాబ్ధాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను రారాజులా ఏలిన సచిన్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోన్నాడు. తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి దానికి తన ఆటతోనే సమాధానం చెప్పేవాడు.

సుధీర్ఘ క్రీడా జీవితంలో ఒక్క వివాదం కూడా లేని ఏకైక క్రికెటర్ సచిన్ ఒక్కడేనమో. పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పులతోనే సచిన్ ఆ స్థాయికి చేరుకున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ఇప్పటికీ ఆటతో ఏదో రకంగా భాగం పంచుకుంటూనే ఉన్నాడు.

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ స్ధాయి ఆటతీరును అతను కనబరచలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి తెలిపిన జీవిత సూత్రాలను సచిన్ తన కుమారుడికి తెలియజేస్తున్నాడు.

క్రికెట్ పట్ల అర్జున్‌కి మంచి మక్కువ వుంది. అయితే ఈ విషయంలో నేను అతనిపై ఒత్తిడి తీసుకురాను.. గతంలో అర్జున్ ఫుట్‌బాల్ ఇష్టంగా ఆడేవాడు.. ఆ తర్వాత చదరంగాన్ని బాగా ఆడేవాడు.. ఇప్పుడు క్రికెట్ వంతు వచ్చింది.

అయితే నేను అతనికి చెప్పేది ఒకటే.. జీవితంలో షార్ట్ కట్స్ ఉండవు.. ఏది చేయగలమో ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని తన తండ్రి చెప్పినట్లుగా సచిన్ గుర్తు చేసుకున్నాడు.

ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతామనే సూత్రాన్ని పిల్లలు గుర్తించాలని సచిన్ తెలిపాడు. కాగా అర్జున్ టెండూల్కర్ ఇటీవల ముగిసిన టీ20 ముంబై లీగ్‌లో బ్యాటు, బంతితో అద్భుతంగా చెలరేగాడు. అర్జున్‌ను ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్ట్రన్ సబర్బ్ టీమ్ ఈ లీగ్ కోసం రూ.5 లక్షలు వెచ్చించి కోనుగోలు చేసింది.