Asianet News TeluguAsianet News Telugu

బాబర్ ఆజమ్ రికార్డుల కోసమే ఈ సిమెంట్ రోడ్లను తయారుచేస్తున్నారా..? : కివీస్ మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్

PAKvsNZ: పీసీబీ తయారుచేస్తున్న ఈ పిచ్ లపై స్వయంగా ఆ దేశానికి చెందిన అభిమానులే  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  టెస్టు  క్రికెట్ ను చంపేయడానికి పీసీబీ కంకణం కట్టుకుందని వాపోతున్నారు. 

Does Pakistan Skipper Babar Azam Ask For Such Roads: New Zealand Former Skipper Shocking Comments On Lifeless Pitches
Author
First Published Jan 5, 2023, 4:22 PM IST

పాకిస్తాన్ క్రికెట్ కు  పూర్వ వైభవం  తెచ్చేందుకు  ప్రయత్నిస్తున్న  ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్జాతీయంగా  చెప్పుకోదగ్గ  టీమ్స్ గా చెలామణి అవుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ను తమ దేశానికి ఆహ్వానిస్తున్నది.  గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు పాకిస్తాన్ కు రాగా ఇప్పుడు న్యూజిలాండ్ కూడా పాక్ లోనే టెస్టులు ఆడుతున్నది. అయితే  ఆ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోతున్నది. తమకు అనుకూలంగా ఉండే విధంగా ప్లాట్ వికెట్లను తయారుచేస్తూ  అంతర్జాతీయ క్రికెట్ సమాజం ముందు అబాసుపాలు అవుతున్నది. 

గతేడాది  ఆస్ట్రేలియాతో రావల్పిండి వేదికగా ముగిసిన టెస్టుతో పాటు కరాచీ, ముల్తాన్ లలో అన్నీ ఫ్లాట్ పిచ్ లే తయారుచేసింది.   బ్యాటర్లు పండుగ చేసుకున్న ఈ పిచ్ పై బౌలర్లు బంతులు విసిరి విసిరి అలిసిపోయారే తప్ప  వికెట్లు మాత్రం తీయలేకపోయారు. సాక్షాత్తు ఐసీసీ కూడా ఈ విషయంలో పాకిస్తాన్ ను మందలించింది. ఈ పిచ్ లకు ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది. 

ఇటీవలే  ఇంగ్లాండ్ తో ముగిసిన మూడు టెస్టులలో కూడా  పాకిస్తాన్ ది అదే వరస.   రావల్పిండి టెస్టులో తొలి రోజే ఇంగ్లాండ్ ఏకంగా 506 పరుగులు చేసింది. దీంతో పాక్  పిచ్ లు తయారుచేయాల్సింది పోయి సిమెంట్ రోడ్లు వేస్తుందని  సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.  తాజాగా  న్యూజిలాండ్ తో కూడా  పీసీబీ తీరు మారలేదు. న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య తొలి టెస్టులో ఫలితం  తేలలేదు.   ఫ్లాట్ పిచ్ పుణ్యమా అని 2021 నుంచి సెంచరీ ముఖం చూడని కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. 

కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కూడా  పాకిస్తాన్ మరోసారి ఫ్లాట్ పిచ్ నే తయారుచేయించింది. ఈ మ్యాచ్ లో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 449 పరుగులు చేయగా  పాకిస్తాన్ 408 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ ఇప్పటికే  180 పరుగులు చేసి  230 పరుగుల ఆధిక్యంలో ఉంది.   ఇవాళ నాలుగో రోజు కావడంతో  రెండో టెస్టులో ఒకటే రోజు ఆట మిగిలిఉంది.  ఇందులో కూడా ఫలితం తేలడం  కష్టమే.  ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్, ఈ టెస్టు సిరీస్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న   సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్తాన్  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా  అతడు మాట్లాడుతూ.. ‘అసలు పాకిస్తాన్ లో పిచ్ లు తయారుచేసేవాళ్లకు ఈ ఆదేశాలు ఎవరిస్తున్నారు..? ఇవి కెప్టెన్ బాబర్ ఆజమ్  నుంచి వస్తున్నాయా..? ఈ సిమెంట్ రోడ్ల మీద  బాగా ఆడి సెంచరీలు చేసి తన గణాంకాలు మెరుగుపరుచుకోవాలని అతడు చూస్తున్నాడా..? తద్వారా తనకంటే పైన ఉన్నవాళ్లను అధిగమించేందుకు యత్నిస్తున్నాడా..? అసలేం జరుగుతుంది..?’ అని  ఆగ్రహం  వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

పీసీబీ తయారుచేస్తున్న ఈ పిచ్ లపై స్వయంగా ఆ దేశానికి చెందిన అభిమానులే  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  టెస్టు  క్రికెట్ ను చంపేయడానికి పీసీబీ కంకణం కట్టుకుందని, ఫలితం తేలని ఈ పిచ్ లను తయారుచేసేకంటే  మ్యాచ్ లు ఆడకుండా ఉంటే అయినా పరువు దక్కుతుందని హితబోధలు   చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios