డక్‌వర్త్ లూయిస్‌ను కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్దమంటారా ఎట్లా..? ఇంగ్లాండ్‌పై అమిత్ మిశ్రా సెటైర్లు
T20 World Cup 2022: పొట్టి ప్రపంచకప్ లో భాగంగా గురువారం ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య ముగిసిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో బట్లర్ గ్యాంగ్ కు ఓటమి తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ పై నెట్టింట్లో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
మెల్‌బోర్న్ వేదికగా గురువారం ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య జరిగిన గ్రూప్-1 మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిలో విజేతను ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం వర్షం కురిసే సమయానికి ఇంగ్లాండ్ విజయానికి మరో 5 పరుగుల దూరంలో ఉంది. దీంతో నిర్వాహకులు ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు. ఇదిలాఉండగా ఈ విజయంపై తాజాగా భారత జట్టు వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తనదైన శైలిలో స్పందించాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లు డీఎల్ఎస్ కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్దమంటారేమో అని దారుణంగా ట్రోల్ చేశాడు.
మ్యాచ్ అనంతరం మిశ్రా తన ట్విటర్ లో స్పందిస్తూ.. ‘అద్భుత విజయం సాధించినందుకు ఐర్లాండ్ కు శుభాకాంక్షలు. అయితే డీఎల్ఎస్ ద్వారా విజయం సాధించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఇంగ్లాండ్ అనదని ఆశిస్తున్నా..’ అని కౌంటర్ ఇచ్చాడు.
క్రికెట్ మ్యాచ్ లలో తమ దేశానికి సంబంధించిన క్రికెటర్లకు సంబంధించిన వ్యవహారాలలో ఇంగ్లాండ్ క్రీడా స్ఫూర్తి అంశాన్ని తెరపైకి తీసుకువస్తుంది. ఇటీవల కాలంలో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. లార్డ్స్ లో ముగిసిన మూడో వన్డేలో చార్లీ డీన్ ను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో రనౌట్ చేసింది. దీని మీద
ఇంగ్లాండ్ తాజా మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం జట్టుతో ఉన్న ఆటగాళ్లు, అక్కడి మీడియా, విశ్లేషకులు, విమర్శకులు అనే తేడా లేకుండా ‘ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’ అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక ఇంగ్లీష్ మీడియా అయితే క్రీడా స్ఫూర్తికి సంబంధించిన కథనాలను వండివార్చింది.
తమ క్రికెటర్ల విషయంలో మాత్రమే క్రీడా స్ఫూర్తిగురించి మాట్లాడే ఇంగ్లాండ్.. ఇతర దేశాల గురించి పట్టించుకోదు. 2019 ప్రపంచకప్ లో తొండాట ఆడి ట్రోఫీ కొట్టడాన్ని సమర్థించుకున్న ఇంగ్లీష్ క్రికెటర్లు.. క్రీడా స్ఫూర్తి గురించి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నా ఆ జట్టు, క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాత్రం దీని మీద లెక్చర్లు ఇస్తూ అభాసుపాలవుతున్నాయి. తాజాగా అమిత్ మిశ్రా కూడా ఇందుకే కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఐర్లాండ్ - ఇంగ్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్.. 14.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. వర్షం పడే సమయానికి ఇంగ్లాండ్ మరో ఐదు పరుగులు చేసి ఉంటే బట్లర్ గ్యాంగ్ నే విజయం వరించేది. మ్యాచ్ పూర్తిగా జరిగితే ఫలితం ఏ విధంగా ఉండేదో గానీ ఐర్లాండ్ బౌలింగ్ ను తక్కువ చేయడానికి లేదు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ కు తొలి ఐదు ఓవర్లలోనే షాకిచ్చారు ఐర్లాండ్ బౌలర్లు. రెండో బంతికే బట్లర్ ను ఔట్ చేసిన ఐర్లాండ్.. ఆ తర్వాత అలెక్స్ హేల్స్, బెన్ స్టోక్స్, హ్యరీ బ్రూక్ లను కూడా 10 ఓవర్లలోనే పెవిలియన్ కు పంపింది.