BoycottLalSinghChadda: మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా థియేటర్లలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నది. అయితే ఈ సినిమాపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన కొత్త చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా గురువారం (ఆగస్టు 11) ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నది. అమీర్ ఖాన్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఈ సినిమాకు ప్రశంసలతో పాటు విమర్శలూ అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. అమీర్ ఖాన్ ఈ సినిమా ద్వారా సిక్కులను, ఇండియన్ ఆర్మీని కించపరిచాడని ఆరోపిస్తున్నాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్. స్వతహాగా సిక్కు అయిన పనేసర్.. తాజాగా అమీర్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. #BoycottLalSinghChadda హ్యాష్ ట్యాగ్ తో అమీర్ ఖాన్ పై మండిపడ్డాడు.
ట్విటర్ వేదికగా పనేసర్ స్పందిస్తూ.. ‘ఫారెస్ట్ గంప్ అనే సినిమా యూఎస్ ఆర్మీకి సరిపోయింది. ఎందుకంటే యూఎస్ లో వియాత్నాం యుద్దం సమయంలో తక్కువ ఐక్యూ ఉన్నవారిని యుద్ధ అవసరాల కోసం యూఎస్ ఆర్మీలోకి ఎంపిక చేశారు. కానీ ఈ సినిమా (లాల్ సింగ్ చడ్డా) అందుకు పూర్తిగా భిన్నం. ఈ సినిమా భారత సాయుధ దళాలకు, సిక్కులకు పూర్తిగా అవమానకరం! అగౌరవం!!’ అని #BoycottLalSinghChadda పై ట్వీట్ చేశాడు.
అమీర్ తాజా చిత్రం 1994లో హాలీవుడ్ లో విడుదలైన Forest Gumpకి రిమేక్. యూఎస్ సైన్యంలో, అమెరికా చరిత్ర పుస్తకాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. వియాత్నాం యుద్ధం సందర్బంగా అక్కడ తక్కువ ఐక్యూ ఉన్న వారిని యుద్ధ అవసరాల కోసం ఆర్మీలో నియమించుకున్నారు. అయితే అమీర్ నటించిన లాల్ సింగ్ చడ్డాలో అమీర్.. సిక్కు పాత్రను సరిగ్గా చిత్రీకరించని కారణంగా తాను ఈ సినిమాను దాని మాతృకతో ఏకీభవించనని పనేసర్ తెలిపాడు.
అతుల్ కులకర్ణి ఈ సినిమాకు రచన చేయగా.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18లు కలిసి ఈ సినిమాను నిర్మించాయి. తెలుగులో మెగస్టార్ చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, కరీనాకపూర్, మోనా సింగ్, మానవ్ విజ్ లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
2019 లో ప్రారంభమైన ఈ సినిమా.. వందకు పైగా లొకేషన్లలో చిత్రీకరించబడింది. కరోనా సందర్బంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 11న విడుదలైంది.

