ICC: ఐసీసీ మీడియా హక్కుల వేలంలోనూ డిస్నీ హవా.. భారీగా వెచ్చించిన స్టార్ యాజమాన్యం
ICC Media Rights: ఇప్పటికే ఐపీఎల్ టీవీ హక్కులు దక్కించుకున్న డిస్నీ స్టార్.. తాజాగా మరో బంపరాఫర్ కొట్టేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మీడియా హక్కులను కూడా డిస్నీ స్టార్ సొంతం చేసుకుంది.
2024-2027 కాలానికి గాను భారత్ లో జరుగబోయే అంతర్జాతీయ మ్యాచ్ ల మీడియా హక్కులను డిస్నీ స్టార్ దక్కించుకుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం వేలం ప్రక్రియను నిర్వహించగా.. శనివారం దానిని అధికారికంగా విడుదల చేశారు. 2024-2027 కాలానికి గాను టీవీ, డిజిటల్ హక్కులు రెండింటినీ డిస్నీయే సొంతం చేసుకోవడం గమనార్హం. ఇందుకోసం డిస్నీ సంస్థ.. సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ. 24 వేల కోట్ల పైనే) చెల్లించినట్టు తెలుస్తున్నది.
నాలుగేండ్ల కాలానికి గాను ప్రస్తుతం నిర్వహించిన వేలం ప్రక్రియలోని నగదు మొత్తం గతంతో పోలిస్తే ఎక్కువే ఉన్నా వాటిని దక్కించుకోవడానికి డిస్నీ వెనుకాడలేదు. ఐసీసీ మీడియా హక్కుల ప్రకారం.. భారత్ లో ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పురుషుల, మహిళల వన్డే ప్రపంచకప్‌లు, టీ20 వరల్డ్ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు అండర్-19 వరల్డ్ కప్ కూడా ఉన్నాయి.
ఐసీసీ మీడియా హక్కుల కోసం డిస్నీతో పాటు సోనీ, వయాకామ్, అమెజాన్, జీ సంస్థలు పోటీపడ్డాయి. అమెజాన్ గతంలో మాదిరిగానే తుది రౌండ్ ముందు వెనక్కితగ్గింది. వేలంలో సోనీ, వయాకామ్, జీ లు డిస్నీతో ఢీ అంటే ఢీ అన్నాయి. కానీ వేలం విలువ రూ. 20 వేల కోట్లు దాటేసరికి అవి వెనుకడుగేశాయి. దీంతో డిస్నీకి ఈ హక్కులు దక్కినట్టు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం ఐసీసీ తెలియజేయలేదు.
డిస్నీ స్టార్ వద్ద ఇప్పటికే ఐపీఎల్ టీవీ ప్రసారహక్కులు, బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో పాటు ఆస్ట్రేలియా బోర్డు డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి. అంతేగాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) హక్కులు కూడా స్టార్ వద్దే ఉన్నాయి. తాజాగా ఇవి కూడా జతకలవడంతో ‘స్టార్’ అభిమానులకు అన్ని మ్యాచ్ లనూ ఒకే ఛానెల్ లో చూసే అవకాశం లభించనుంది. ఇదిలాఉండగా భారత్ లో మీడియా హక్కులు ముగియగా.. అమెరికా, ఇంగ్లాండ్ లలో హక్కుల కోసం క్రిస్మస్ కు ముందు మరోసారి వేలం నిర్వహించనున్నట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి.