Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్ పేరు చెప్పి, కోట్లు తీసుకున్నారు! అయినా మారని ఉప్పల్ స్టేడియం దుస్థితి... ఉన్న కాస్త పరువు కూడా...

పావురాలు వేసిన రెట్టలతో నిండిన సీట్లు, ప్రపంచ కప్ మ్యాచులు చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లిన అభిమానులకు... 

Dirty seats, poor facilities welcome Cricket fans in Hyderabad Uppal Stadium, ICC World cup 2023 CRA
Author
First Published Oct 4, 2023, 11:51 AM IST | Last Updated Oct 4, 2023, 11:52 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇండియాలోని 10 ముఖ్య నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచులు జరగబోతున్నాయి. ప్రపంచ కప్ నిర్వహించే స్టేడియాల్లో వసతుల మెరుగుపర్చేందుకు, మరమ్మత్తులు చేసేందుకు భారీగా ఖర్చు చేసింది బీసీసీఐ. ప్రపంచ కప్ మ్యాచుల సమయంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే క్రికెట్ ఫ్యాన్స్‌కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వసతులను మెరుగుపర్చేందుకు ఒక్కో స్టేడియానికి రూ.100 కోట్ల వరకూ నిధులు విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి..

బీసీసీఐ నుంచి వచ్చిన నిధులతో ఈడెన్ గార్డెన్స్, ధర్మశాల స్టేడియాల్లో సరికొత్త హంగులతో మెరిసిపోతున్నాయి. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం పరిస్థితిలో మాత్రం అస్సలు మార్పు రాలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 3 మ్యాచులు మాత్రమే హైదరాబాద్‌లో జరగబోతున్నాయి. ఇందులో రెండు మ్యాచులు పాకిస్తాన్‌వే..

న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య మొదటి వార్మప్ మ్యాచ్‌కి సెక్యూరిటీ కల్పించలేమని పోలీసు శాఖ చేతులు ఎత్తేయడంతో గేట్లు మూసేసి మ్యాచులు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్‌కి మాత్రం ప్రేక్షకులను అనుమతించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.

అయితే ఈ మ్యాచులను చూసేందుకు వెళ్లిన వారికి చేదు అనుభవమే ఎదురైంది. అప్పుడెప్పుడో ఐపీఎల్ 2023 టైమ్‌లో హైదరాబాద్‌లో మ్యాచులు జరిగాయి. అప్పుడు పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉందని క్రికెట్ ఫ్యాన్స్ వాపోయారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన క్రికెట్ కామెంటేటర్ సీ వెంకటేశ్, సోషల్ మీడియాలో ఉప్పల్ స్టేడియంలో దారుణ పరిస్థితులను తెలియచేశాడు..

పావురాలు వేసిన రెట్టలతో సీట్లు నిండిపోయి, కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ డబ్బులు పెట్టి టికెట్ కొన్నవారి వెక్కిరిస్తున్నాయి. బీసీసీఐ ఇచ్చిన డబ్బులతో స్టేడియంలో కొన్ని విండో డ్రెస్సింగ్ సీట్లను మాత్రమే మార్చిన హెచ్‌సీఏ, మిగిలిన స్టాండ్స్‌లోని సీట్లను క్లీన్ చేయడం కానీ, మరమ్మత్తులు నిర్వహించడం కానీ చేయలేదని వెంకటేశ్ వరుస ట్వీట్లు చేశాడు.  అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి..

హైదరాబాద్‌లో అక్టోబర్ 6న పాకిస్తాన్- నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 10న పాకిస్తాన్- శ్రీలంకతో మ్యాచ్ ఆడుతుంది. ఈ మూడు మ్యాచులతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచులు ముగుస్తాయి..

పాకిస్తాన్ ఆడే మ్యాచులు కావడంతో స్టేడియానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు. అదీకాకుండా పాకిస్తాన్ నుంచి క్రికెట్ ఫ్యాన్స్‌కి వీసా రావడం అంత తేలికైన విషయం కాదు. హైదరాబాద్‌లో ఉండే క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తే, చాలా తీవ్రమైన పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టేడియానికి వచ్చే వంద, 200 మంది ఫ్యాన్స్ కోసం ఈ మాత్రం చేస్తే చాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుకుని ఉంటుందని ట్రోల్స్ వినిపిస్తున్నాయి..

అయితే వరల్డ్ కప్ మ్యాచులు చూడాలని హైదరాబాద్‌కి వచ్చే నెదర్లాండ్స్, న్యూజిలాండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇలాంటి అనుభవం ఎదురైతే, భారతదేశం, బీసీసీఐ పరువు పోవడం ఖాయం. 

బీసీసీఐ ఇచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచి పెట్టి, ఐపీఎల్ సమయానికి అందులో కాస్తో కూస్తో ఖర్చు చేయాలని హెచ్‌సీఏ ఆలోచిస్తోందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.  వచ్చే ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచుల సమయంలో కొత్త సీట్లతో స్టేడియం కళకళ లాడుతుందని వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్..  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios