టీమిండియా క్రికెటర్ దినేశ్ మోంగియా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వన్డే,టీ20, టెస్ట్ ఫార్మాట్లన్నింటి నుండి తప్పుకుంటున్నట్లు ఇవాళ(బుధవారం) మోంగియా నుండి ఓ ప్రకటన వెలువడింది. నేటితో అతడి 12ఏళ్ల నిరీక్షణకు కూడా తెరపడింది.

2001లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మోంగియా 2002 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. గౌహతి వేదికన జరిగిన ఈ మ్యాచ్ లో సెంచరీ(159 పరుగులు)తో సత్తా చాటిన అతడు టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2003 లో జరిగిన ప్రపంచ కప్ లో కూడా భారత తరపున ఆడాడు. 

అయితే 2007 లో ఇండియన్ క్రికెట్ లీగ్ లో టోర్నమెంట్ లో ఆడినందుకు బిసిసిఐ అతడిపై నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత ఈ నిషేధం రద్దయినా అతడికి భారత జట్టులో మాత్రం  చోటు దక్కలేదు. ఇలా దాదాపు 12ఏళ్లుగా అతడు క్రికెట్ కు దూరంగా వుంటున్నాడు. ఇలా  సుధీర్ఘ విరామం తర్వాత మోంగియా క్రికెట్  నుండి రిటైరవుతున్నట్లు తాజాగా ప్రకటించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 121 మ్యాచులాడిన అతడు 21  సెంచరీలు సాధించాడు. ఇలా అద్భుతంగా రాణించడంతో అతడికి అంతర్జాతీయ చోటు దక్కింది. అలా భారత జట్టు తరపున 57 అంతర్జాతీయ వన్డేలు, కేవలం ఒకే ఒక టీ20 ఆడాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.