నువ్వు లేకుంటే నా కొంప కొల్లేరయ్యేది.. థ్యాంక్యూ : అశ్విన్‌కు కృతజ్ఞతలు తెలిపిన దినేశ్ కార్తీక్
T20 World Cup 2022: మెల్‌బోర్న్‌లో మూడు రోజుల క్రితం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో ఆఖరి బంతికి ఫోర్ కొట్టి భారత జట్టును గెలిపించిన రవిచంద్రన్ అశ్విన్ కు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కృతజ్ఞతలు తెలిపాడు.
గత ఆదివారం ఉత్కంఠభరితంగా ముగిసిన భారత్-పాక్ మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్ లో హైడ్రామా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ విరాట్ కోహ్లీ (82 నాటౌట్) వీరోచిత పోరాటానికి తోడు హార్ధిక్ పాండ్యా (40) నిలకడ తోడై భారత్ కు అపూర్వ విజయాన్ని అందించింది. ఇక ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో సాగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ఈ ఓవర్లో చివరి బంతికి ఫోర్ కొట్టి భారత్ ను గెలిపించినందుకు గాను అశ్విన్ కు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కృతజ్ఞతలు తెలిపాడు.
పాకిస్తాన్ తో మ్యాచ్ ముగించుకున్న తర్వాత ఈనెల 27 నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు సిడ్నీకి చేరుకున్నది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో కార్తీక్.. అశ్విన్ కు అందరూ చూస్తుండగానే థ్యాంక్స్ చెప్పాడు. తనను అశ్విన్ కాపాడడని, లేకుంటే తన పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పాడు.
బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోలో సిడ్నీ ఎయిర్ పోర్టులో కార్తీక్ అశ్విన్ తో.. ‘నిన్న రాత్రి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అశ్విన్.. థ్యాంక్స్..’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. వాస్తవానికి పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ గెలిచింది కాబట్టి సరిపోయింది గానీ లేకుంటే దినేశ్ కార్తీక్ పై తీవ్ర విమర్శలు వచ్చేవి. ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన కార్తీక్.. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా నవాజ్ వేసిన ఐదో బంతికి స్టంప్ అవుట్ అయ్యాడు.
ఆ సమయంలో సీనియర్ బ్యాటర్ అయిన కార్తీక్ మీద భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అతడు మాత్రం ముందుకొచ్చి ఆడి వికెట్ పారేసుకున్నాడు. అయితే చివరి బంతికి బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అశ్విన్.. నవాజ్ వేసిన వైడ్ బంతిని వదిలేశాడు. దీంతో స్కోర్లు లెవల్ అయ్యాయి.
ఇక చివరి బంతికి అశ్విన్ ను సింగిల్ తీయకుండా అడ్డుకుందామని బాబర్ ఆజమ్ ఫీల్డర్లను అందరినీ రింగ్ లోపలే మొహరించాడు. అయితే అది గమనించిన అశ్విన్.. మిడాఫ్ మీదుగా షాట్ ఆడి భారత్ కు అపూర్వ విజయాన్ని అందించాడు.
ఒకవేళ అశ్విన్ కూడా సరిగా ఆడకుంటే విమర్శకులు దినేశ్ కార్తీక్ తాట తీసేవారు. అసలే రిషభ్ పంత్ తో తీవ్ర పోటీ ఉన్నా దినేశ్ కార్తీక్ ను ఆడిస్తున్న భారత మేనేజ్మెంట్.. తర్వాత మ్యాచ్ లో కార్తీక్ ను ఆడించాలా..? లేదా...? అని ఆలోచించి ఉండేది. మ్యాచ్ గెలవడం వల్ల దినేశ్ కార్తీక్ తో పాటు అక్షర్ పటేల్ కూడా బ్రతికిపోయాడు. అతడు కూడా ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు.