టీం ఇండియాలో తనకు చోటు దక్కకపోవడానికి కారణం దినేశ్ కార్తీక్ అంటూ... పేస్ బౌలర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా... శ్రీశాంత్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. కార్తీక్ తన కెరీర్ నాశనం చేశాడంటూ.... శ్రీశాంత్ పరోక్షంగా ఆరోపించాడు. అంతేకాక.. కేరళ, తమిళనాడు మధ్య జరిగే మ్యాచ్‌లో కార్తీక్‌ను ఏం చేస్తానో చూడు అంటూ సవాల్ కూడా విసిరాడు. కాగా... ఈ ఆరోపణలపై తాజాగా దినేశ్ కార్తీక్ స్పందించాడు.
 
‘‘టీం ఇండియా నుంచి తను బయటకు రావడానికి నేనే కారణం అంటూ ఎస్.శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు నేను విన్నాను. అటువంటి ఆరోపణపై మాట్లాడటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది’’ అని కార్తీక్ పేర్కొన్నాడు.
 
ఛాంపియన్స్‌ ట్రోఫీ 2013లో తనకు జట్టులో చోటు దక్కకపోవడానికి కార్తీక్ కారణం అని శ్రీశాంత్ కొద్ది రోజుల క్రితం అన్నాడు. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీ అంచనా జట్టును ప్రకటించే రోజు సాయంత్రం అక్కడ నేను లేను. అక్కడ నేను లేను అనే విషయాన్ని ప్రధాన తప్పుగా భావించారు. డీకే, నువ్వు ఇది చదివితుంటే.. నువ్వు నాకు, నా కుటుంబానికి ఎంత ద్రోహం చేశావో గుర్తు తెచ్చుకో. వచ్చే ఏడాది కేరళ, తమిళనాడు మ్యాచ్‌ ఉంది. అక్కడ ఏ జరుగుతుందో నీకు బాగా తెలుసు. గాడ్ బ్లెస్ యూ’’ అంటూ శ్రీశాంత్ పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.