మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ జట్టును ప్రపంచంలోను నెంబర్ వన్ స్థాయికి  తీసుకొచ్చిన కూల్ కెప్టెన్. విరాట్ కోహ్లీ... టీమిండియా నెంబర్ వన్ స్ధానాన్ని పదిలంగా కాపాడటం కోసం వ్యక్తిగతంగా శ్రమిస్తూ... జట్టును ముందుడి నడిపిస్తూ ఉత్తమ కెప్టెన్ గా పేరు తెచ్చకున్నాడు. భారత జట్టు సారథ్యం, మైదానంలో ఆటగాళ్లతో వ్యవహరించే తీరు, ఆలోచనా విధానం ఇలా ప్రతి విషయంలోనూ వీరిద్దరిది విభిన్నమైన దారులే.  కానీ లక్ష్యం మాత్రం భారత్ విజయమే. ఇలా విభిన్నంగా జట్టును నడిపించే  వీరిద్దరు మైదానంలో బౌలర్లతో ఎలా వ్యవహరిస్తారో తాజాగా కుల్దీప్ యాదవ్ బయటపెట్టాడు. 

'' ధోని, కోహ్లీ జట్టులో వుంటే బౌలర్లకు ఎంతో దైర్యాన్నిస్తారు. ముఖ్యంగా కోహ్లీకి బౌలర్లకు ధైర్యాన్నిస్తే...ధోని ఎక్కువ స్వేచ్చనిస్తాడు. తాము ఏకాస్త ఒత్తిడికి లోనైనా కోహ్లీ  దగ్గరకు వచ్చి ధైర్యాన్నిస్తాడు. కానీ సలహాలు, సూచనలు ఇవ్వడు. అదే ధోని అయితే ఎక్కడ తప్పు చేస్తున్నామో పసిగట్టి సలహాలు,సూచనలు ఇస్తుంటాడు. 

ధోని వద్ద ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. బౌలర్ల ఇబ్బందిని వికెట్ల వెనకాల నుండే గుర్తించే నేర్పు ధోని సొంతం. అందువల్ల తాము అడగకున్నా విలువైన సలహాలిస్తూ మాకు సహకరిస్తాడు. వికెట్ల వెనకాల నిల్చుని మాయ చేయడంలో ధోనిని మించిన  వికెట్ కీపర్ ప్రపంచ క్రికెట్ లో లేడు.

అతడిలో కేవలం ఓ అత్యుత్తమ వికెట్ కీపర్ మాత్రమే కాదు అంతకంటే  గొప్ప సైక్రియాటిస్ట్ దాగున్నాడు.  బౌలర్ బంతిని ఎలా వేస్తాడు, బ్యాట్ మెన్ దాన్నెలా ఎదుర్కోడానికి  ప్రయత్నిస్తాడో ముందే తెలుసుకుని...అప్పుడు తానేం చేయాలో కూడా ఓ నిర్ణయానికి వస్తాడు. అలాంటి గొప్ప కెప్టెన్, బ్యాట్ మెన్, వికెట్ కీపర్ టీమిండియాకు దొరకడం అదృష్టం'' అంటూ కుల్దీప్  ధోనిని  ప్రశంసలతో ముంచెత్తాడు.