Asianet News TeluguAsianet News Telugu

రావల్పిండిలో బాగా ఆడారు కానీ లార్డ్స్‌లో జరిగింది అప్పుడే మరిచిపోయావా? మైఖేల్ వాన్‌‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం

PAKvsENG: పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య  రావల్పిండి వేదికగా సోమవారం ముగిసిన  తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.  చివరి నిమిషం వరకూ పోరాడి గెలుపును సొంతం చేసుకుంది. అయితే ఈ విజయంపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. 

Did you Forget Lords Test: Fans Slams Michael Vaughan's Tweet on ben Stokes, Hails Virat Kohli
Author
First Published Dec 6, 2022, 12:41 PM IST

ఫలితం తేలదనుకున్న రావల్పిండి  టెస్టులో ఇంగ్లాండ్ అద్భుత పోరాటపటిమతో  ఆట చివరినిమిషం వరకూ పోరాడి  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆట చివరిరోజున ఇంగ్లాండ్ బౌలర్లు వికెట్ల కోసం  తీవ్రంగా శ్రమించి సఫలీకృతమయ్యారు.  బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై  పాక్ బ్యాటర్స్ ను  పెవిలియన్ లో కూర్చోబెట్టి విజయాన్ని అందుకున్నారు. విదేశాలలో ఇంగ్లాండ్ సాధించిన గొప్ప విజయాలలో ఈ మ్యాచ్ కూడా ఒకటిగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం  ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ చేసిన ట్వీట్ మాత్రం టీమిండియా ఫ్యాన్స్ కు రుచించలేదు.   

ఇంగ్లాండ్ - పాక్ తొలి టెస్టు ముగిసిన తర్వాత మైఖేల్ వాన్ తన ట్విటర్ లో.. ‘మా జట్టు సాధించిన అత్యద్భుత విజయాలలో ఇదీ ఒకటి.  నాకు తెలిసి టెస్టు క్రికెట్ చరిత్రలో  ఏ కెప్టెన్ కూడా  తన బ్యాటర్స్ ను ఇలా దూకుడుగా ఆడాలని, ఇంత ధైర్యంగా డిక్లేర్ చేసి  బౌలర్లను వికెట్ల కోసం  స్ఫూర్తి కలిగించే విధంగా చెప్పి ఉండడు.. నమ్మశక్యం కాని  విజయమిది..’ అని  ట్వీట్ చేశాడు.  

ఈ ట్వీట్ ఇప్పుడు టీమిండియా అభిమానులకు మరీ ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. మైఖేల్ వాన్ చరిత్ర గురించి మరిచిపోయినట్టు ఉన్నాడని.. ఏడాదిన్నర క్రితమే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టుకు చుక్కలు చూపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2021లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు  రెండో టెస్టు (లార్డ్స్) లో  చివరి రోజు ఇంగ్లాండ్ కు టీమిండియా బౌలింగ్ రుచి చూపించింది.    60 ఓవర్లు మాత్రమే మిగిలిఉన్న మ్యాచ్ లో డిక్లేర్ ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేలా వ్యూహాలు రూపొందించాడు కోహ్లీ. అతడి అభిమానులు కూడా ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘ఈ 60 ఓవర్లు వాళ్లకు చుక్కలు కనబడాలి’ అని కోహ్లీ తన బౌలర్లలో స్పూర్తి రగిలించిన విషయాన్ని కూడా  ప్రస్తావిస్తున్నారు. 

 

 

వాన్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ‘అదేంటి, మీరు  లార్డ్స్ టెస్టును మరిచిపోయారా.. ? రెండు సెషన్లలో మీకు చుక్కలు చూపించాం కదా..? అది గుర్తుంచుకోండి  సార్..’, ‘60 ఓవర్లలో పది వికెట్లు తీశాం.  అది కూడా  బ్యాటింగ్ కు అనుకూలించే ఫ్లాట్ వికెట్ మీద...’, ‘టెస్టు క్రికెట్ కు విరాట్ బ్రాండ్ అంబాసిడర్. లార్డ్స్ లో విరాట్ అగ్రెసివ్ కెప్టెన్సీ వల్లే కదా మీరు 60 ఓవర్లలో తోక ముడిచారు.  మీరు అది మరిచిపోతే ఎలా..?’ ‘లార్డ్స్ ది గుర్తు లేకుంటే అడిలైడ్ టెస్టు (ఆస్ట్రేలియా-భారత్) గుర్తుకు తెచ్చుకో. మాకు డ్రా కోసం ఆడే ఉద్దేశమే లేదు. ఫలితం తేలాల్సిందే..  డ్రా మాకు లాస్ట్ ఆప్షన్ అని కోహ్లీ అన్నాడు. రావల్పిండిలో  ఇంగ్లాండ్ బాగా ఆడింది. కాదనము. కానీ మీరు అంతకుముందే ఇటువంటివి ఎన్నో చేసి చూపించిన కోహ్లీని మరిచిపోతే ఎలా..?’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios