కరోనా కారణంగా క్రికెట్  సహా అన్ని ప్రధాన క్రీడలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరిగింది. లాక్‌డౌన్ సమయంలో క్రికెటర్లంతా కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ఎప్పుడూ విభిన్నంగా చేసే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

కరోనా సమయంలో రాంచీలోని తన ఫాం హౌస్‌లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆయన.. సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తన సొంత బ్రాండ్‌తో త్వరలోనే ఎరువులను మార్కెట్‌లోకి తీసుకురానున్నాడు.

Also Read:ఐపీఎల్ నిర్వహణకు న్యూజీలాండ్ రెడీ, కానీ కాలమానం...?

ధోనీ 39వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలను ఆయన ప్రాణ మిత్రుడు మిహిర్ దివాకర్ వెల్లడించారు. ధోనికి సుమారు 50 ఎకరాల పొలం వుంది. అతనికి సైనికుడిగా పనిచేయడమన్నా.. రైతుగా ఉండటమన్నా చాలా ఇష్టం. ప్రస్తుతం ధోనీ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు.

ఇదే సమయంలో తమ వద్ద పలువురు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు కొత్త రకం సేంద్రీయ ఎరువును అభివృద్ధి చేశారని దివాకర్ చెప్పారు. రెండు, మూడు నెలల్లో నియో గ్లోబల్ పేరుతో మార్కెట్లోకి తెస్తామని మిహిర్ పేర్కొన్నారు.

Also Read:నువ్వు వాటికి లొంగనివాడివి: తన భర్త ఎలాంటి వాడో చెప్పిన ధోనీ భార్య

కరోనా తగ్గి పరిస్థితులు కుదుటపడే వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనరాదని ధోని నిర్ణయించుకున్నాడని దివాకర్ తెలిపారు. కాగా మంగళవారం ధోనీ తన 39వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు అభిమానులు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.