ఐపీఎల్ 2019 తుది అంకానికి చేరుకుంది. గత ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ప్రదర్శన ద్వారా నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. మే 12న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఎప్పటిలాగే చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుపై అందరి అంచనాలున్నాయి.

ఎంత ఒత్తిడిలో ఉన్నా వ్యూహాలు రచిస్తూ, వనరులను ఉపయోగించుకుంటూ ధోని జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ధోని కొన్ని సంఘటనల ద్వారా ఆశ్చర్యపరిచాడు.

అవేంటో ఒకసారి చూస్తే:

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ధోని వ్యక్తత్వం. అందుకు నిదర్శనంగా ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే పడుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ అంటేనే బిజీ షెడ్యూల్. సరిగా విశ్రాంతి తీసుకోవడానికి ఆటగాళ్లకు తీరిక ఉండదు.

ఈ క్రమంలో ఈ సీజన్ తొలి వారంలో కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం చెన్నై.. రాజస్థాన్‌తో మ్యాచ్ కోసం జైపూర్ వెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంగా రాత్రి మ్యాచ్ ముగిసిన వెంటనే తెల్లవారుజామునే ప్రయాణానికి సిద్ధమవ్వాల్సి వచ్చింది.

దీంతో ధోనీ అతని భార్య సాక్షి ఇద్దరూ నేలపైనే పడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను జట్టు యాజమాన్యం ఆన్‌లైన్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీ ఏకంగా అంపైర్‌పైనే విరుచుకుపడటం అభిమానులతో పాటు జట్టు యాజమాన్యాన్ని షాక్‌కు గురిచేసింది. రాజస్దాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఔటై పెవిలియన్‌కు వెళ్లాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ శాంట్నర్ స్టోక్స్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.

అతను ఆడిన తొలి బంతిని నోబాల్‌గా ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. తర్వాత లెగ్ అంపైర్ దానిని కాదని బంతిగా కౌంట్‌ చేశాడు. దీంతో పెవిలియన్‌లో ఉన్న ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. 

ప్రపంచ క్రికెట్‌లోని ఆల్‌టైమ్ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోనీ ఒకరు. అతను కీపింగ్‌లో ఉన్నప్పుడు బ్యాట్స్‌మెన్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా స్టంపులు గాల్లోకి ఎగురుతాయి. ఈ ఐపీఎల్‌లో ధోనీ తన అద్బుతమైన స్టంపింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలేత్తించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్రిస్ మోరిస్, శ్రేయస్ అయ్యర్‌ను ధోనీ మెరుపు వేగంతో స్టింపింగ్ చేసి హడలెత్తించాడు. 

ఐపీఎల్‌ టోర్నీలో మహేంద్రుడు తన పేరిట రికార్డులు లిఖించుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వీర విహారం చేసి 48 బంతుల్లో 84 పరుగులు చేశాడు.

అలాగే ఈ మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాది ఐపీఎల్‌లో 200 సిక్సులు కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం ద్వారా ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 

భారత మాజీ కెప్టెన్‌గా సేవలందించడంతో పాటు తమ జట్టును విజయాలబాట పట్టించిన ధోనీ అంటే తమిళులకు చచ్చేంత ఇష్టం. ఐపీఎల్‌లో మొత్తం మూడుసార్లు చెన్నైని విజేతగా నిలబెట్టడంతో తమిళనాడు అభిమానులు ధోనీని ‘తలా ’ అని ముద్దుగా పిలుస్తారు. ఈ పేరంటే తనకు చాలా ఇష్టమని, వాళ్లు అలా పిలుస్తుంటే గర్వంగా ఉంటుందని మహీ తెలిపాడు.