ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నిప్పులు చెరిగాడు. రిషబ్ పంత్ విషయాన్ని ప్రస్తావిస్తూ ధోనీపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ సమర్థవంతమైన ఆటగాడని, అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని ఆయన అన్నాడు. 

పంత్ పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ 2011 - 12 కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్ సమయంలో ధోనీ తన విషంలో వ్యవహరించిన తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ సిరీస్ లో తనతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ధోనీ తనను జట్టు నుంచి తప్పించాడని ఆయన అన్నాడు. రిషబ్ పంత్ విషయంలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ అలా చేయకూడదని ఆయన అన్నాడు. 

డ్రెసింగ్ రూంలో సరైన సమాచారం ఇచ్చేవాడు కాడని సెహ్వాగ్ ధోనీపై వ్యాఖ్యానించాడు. స్లో ఫీల్డర్లు కాబట్టి సెహ్వాగ్, సచిన్ టెండూవల్కర్, గౌతం గంభీర్ లను రొటేట్ చేస్తున్నట్లు మీడియాకు చెప్పాడని, ఆ విషయం తమకు ఏ రోజూ కూడా డ్రెసింగ్ రూంలో చెప్పలేదని ఆయన అన్నాడు. 

ఆ విషయంలో జట్టు సభ్యుల  సమావేశంలో చర్చకు రాలేదని, రోహిత్ శర్మను ఆడించాలనే విషయం చర్చకు వచ్చిందని ఆయన చెప్పాడు. ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలోనూ అదే జరుగుతోందని, అది మంచిది కాదని ఆయన అన్నాడు. 

ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ధోనీ లాగే చేస్తున్నాడో లేదో తనకు తెలియదని, తనకు జట్టుతో ఏ విధమైన సంబంధం లేదని అన్నాడు. కానీ ఆసియా కప్ సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతను ప్రతి ఆటగాడితోనూ చర్చించేవాడని ఎవరో చెబుతుంటే తాను విన్నానని సెహ్వాగ్ చెప్పాడు.