భారత క్రికెట్ లో  ఒక్కసారిగా కలకలం రేగింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో మహిళా క్రికెటర్లు కొందరిని బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదించడం క్రికట్ ప్రియులనే కాదు బిసిసిఐని కలవరపాటుకు  గురిచేసింది. దీంతో రంగంలోకి దిగిన బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం దీనిపై విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ షెకావత్ ధోని, కోహ్లీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

'' అంతర్జాతీయ క్రికెట్ లో మంచి  స్థాయిలో వున్న ఆటగాళ్లెవరూ వివాదాల జోలికి వెళ్లరు. కాబట్టి అలాంటివారు  మ్యాచ్ ఫిక్సింగ్ వంటి వాటికి చాలా దూరంగా వుంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లీ లే అందుకు మంచి ఉదాహరణ. వారి కెరీర్ ప్రారంభమే చాలా ఏళ్లయినా ఇప్పటివరకు వారిపై కనీసం ఒక్క ఆరోపణ కూడా రాలేదు. యువ క్రికెటర్లందరు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. 

అంతర్జాతీయ స్థాయిలో రాణించని, భవిష్యత్ గురించి నమ్మకం లేని వారే ఎక్కువగా బుకీల వలలో పడతారు. అంతేకాకుండా కెరీర్ ఆరంభంలో వున్న యువ క్రికెటర్లను బుకీలు భారీగా డబ్బులు ఆశ చూపించి మభ్య పెడుతుంటారు. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ బారిన పడి కెరీర్ ను నాశనం చేసుకునే కంటే ఆటపై దృష్టిపెట్టి మంచి  పేరు సంపాదించుకుంటే డబ్బులు వాటంతట అవే వస్తాయని యువకులు గుర్తించాలి.

సీనియర్ ఆటగాళ్లను బుకీలు సంప్రదించడానికి వెనకాడతారు. ఎందుకంటే వారిచ్చే చిల్లర డబ్బులకు సీనియర్లు లొంగరని తెలుసు. మరీ ముఖ్యంగా ధోని, కోహ్లీ  వంటి ఆటగాళ్ళు అధికారంగా వాణిజ్య ప్రకటనలు, మ్యాచ్ పీజుల రూపంలోనే భారీ  మొత్తంలో అర్జిస్తారు. కాబట్టి అనవసర వివాదాల్లో తలదూర్చి కెరీర్ ను నాశనం చేసుకోవాలని అనుకోరు. 

యువ క్రికెటర్లకు ముందు ఆటపై అంకితభావాన్ని కలిగివుండాలి. ఆ తర్వాతే ఆదాయం గురించి ఆలోచించాలి.అలాకాకుండా ఆదాయం ముందు ఆట తర్వాత అనుకుంటే మ్యాచ్ ఫిక్సింగ్ వంటి  వివాదాల్లో చిక్కుకుని ఆట, ఆదాయం  రెండింటిని కోల్పోయే ప్రమాదం వుంది. కాబట్టి తాము చెసేది తప్పో, ఒప్పో తెలుసుకుని  నిర్ణయాలు తీసుకోవాలి.'' అని అజిత్ సింగ్ పేర్కొన్నారు.