మహేంద్ర సింగ్ ధోని... యావత్ భారత క్రికెట్ అభిమానులను తన ఆటతీరు, కెప్టెన్సీతో తన అభిమానులుగా మార్చుకున్న ఆటగాడు. మొదట్లో అతడి జులపాల హెయిర్ స్టైల్, ధనాధన్ షాట్లతో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారప్ చేతే ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తన అత్యుత్తమ ఆటతీరుతో భారత జట్టులో కీలక ఆటగాడిగానే కాదు జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించి కూల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకుని విజయవంతమయ్యాడు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుండి ధోని చెన్నై జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిపై తమిళ ప్రజలు ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని  పెంచుకున్నారు. ఏ రంగంలో అయినా తమ రాష్ట్రానికి చెందిన వారికే ఎక్కువగా ప్రోత్సహించే తమిళులు ధోని విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ధోని అంటే తమిళ అభిమానులు ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. 

ఇలా వివిధ సందర్భాల్లో ధోని అంటే తమకెంత అభిమానమో చాటుకున్న చెన్నై జట్టు అభిమానులు.... ఈ సారి ఆ అభిమానాన్ని ఫీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లారు. ఈ నెల 23న బెంగళూరు జట్టుతో హోం గ్రౌండ్ లో చెన్నై తలపడనుంది. ఈ సందర్భంగా ఇవాళ చెన్నై జట్టు ఆటగాళ్ళు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ప్రాక్టిస్ సెషన్లో ధోని పాల్గొంటున్నట్లు తెలుసుకున్న  అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఇలా కేవలం ప్రాక్టీస్ సెషన్ కోసమే దాదాపు 12 వేల మంది అభిమానులు స్టేడియంకు తరలివచ్చిన చెన్నై ప్రాంచైజి తెలిపింది. ఇక తమ అభిమాన ఆటగాడు స్టేడియంలోకి అడుగుపెడుతున్న సమయంలో వారు కరతాళ ద్వనులతో స్వాగతం పలికారు. 

 ఈ సందర్భంగా ఓ అభిమాని ధోనిని స్టేడియంలో పరుగెత్తించాడు. సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి చేరుకున్న అభిమాని ధోని వైపు పరుగెత్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన ధోని అతడికి దొరకకుండా సరదాగా మైదానంలో పరుగెత్తాడు. చివరకు ధోని వెంటపడుతున్న అభిమానిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అయితే ధోని అతడి వద్దకు షేక్ హ్యండ్ ఇవ్వడంతో సదరు అభిమాని ఆనందంతో మైదానం వీడాడు. 

ఇలా ధోనికి సంబంధించిన ఈ వీడియోలను చెన్నై  జట్టు అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు అభిమానులకు తెగ నచ్చడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలను కింద చూడండి.