ఐపీఎల్‌లో భాగంగా టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. 217 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ధోనీ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించాడు మహీ. తాను చాలా కాలంగా బ్యాటింగ్ చేయలేదని.. యూఏఈకి వచ్చాకా 14 రోజుల క్వారంటైన్ నిబంధన కూడా తన ప్రాక్టీస్‌పై ప్రభావం చూపిందని ధోనీ తెలిపాడు.

విభిన్నంగా ప్రయత్నించడంలో భాగంగానే సామ్ కరన్‌కు అవకాశం ఇవ్వాలని భావించానని.. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే మన బలంపై దృష్టి పెట్టొచ్చని మహీ చెప్పాడు. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో మంచి శుభారాంభాలు అవసరమని.. రాజస్థాన్ జట్టులో స్మిత్, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడారని ధోనీ ప్రశంసించాడు.

చివర్లో ఆర్చర్ సైతం అద్బుతంగా ఆడాడని కొనియాడాడు. రాజస్థాన్‌ను 200 లోపు కట్టడి చేసుంటే పరిస్ధితి మరోలా ఉండేదని మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నై ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 16 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. అయితే చెన్నై జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. రన్‌రేట్ పెరుగుతున్న తరుణంలో ధోనీ 7వ స్థానంలో బరిలోకి దిగాడు.