ధోనిని హెయిర్ కట్ చేయించుకోవద్దన్న ముషారఫ్.. పాక్ మాజీ అధ్యక్షుడి మాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్
Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆదివారం తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేటి ఉదయం దుబాయ్ లో కన్నుమూశారు. భారత క్రికెట్ లో ధోని అంటే ఆయనకు చాలా ఇష్టం.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) నేడు దుబాయ్ లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముషారఫ్.. దుబాయ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం కన్నుమూసినట్టు పాకిస్తాన్ లోని జియో న్యూస్ రిపోర్టులో వెల్లడించింది. 2001లో పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముషారఫ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. అతడి హయాంలో భారత జట్టు రెండు సార్లు పాక్ కు పర్యటించింది. 2005-06 భారత జట్టు పాక్ టూర్ కు వెళ్లినప్పుడు ముషారఫ్.. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసి ముచ్చటపడ్డాడు. ఆ సిరీస్ లో ధోని దుమ్ము రేపాడు.
అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగులు వేస్తున్న ధోనికి అప్పుడు జులపాలు ఉండేవి. నిండైన జుట్టుతో ఉండే యంగ్ ధోని.. అప్పటికింకా సారథి కాలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో అతడు పాక్ తో సిరీస్ లో రెచ్చిపోయి ఆడాడు.
ఈ టూర్ లో భారత్ వన్డే సిరీస్ గెలిచిన మ్యాచ్ ను వీక్షించడానికి ముషారఫ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ప్రెజంటేషన్ సందర్భంగా ముషారఫ్ మాట్లాడుతూ ధోనిని ప్రశంసల్తో ముంచెత్తారు. ధోని జులపాలు కత్తిరించుకోవద్దని, ఇలాగే ఉండనీయాలని అతడిని కోరారు. ముషారఫ్ మరణం నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ముషారఫ్... ‘మొదలు నేను ఇండియా టీమ్ కు కృతజ్ఞతలు చెబుతున్నా. వాళ్లు చాలా బాగా ఆడారు. ధోనికి నా ప్రత్యేక అభినందనలు. ఈ విజయంలో అతడు కీలక భూమిక పోషించాడు. మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ఎవరో ధోనిని హెయిర్ కట్ చేయించుకోవాలని ప్లకార్డు పట్టుకున్నారు. కానీ ధోని నువ్వు నా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. నువ్వు హెయిర్ కట్ చేయించుకోవద్దు. నువ్వు ఈ జులపాలలోనే అందంగా ఉన్నావు. డోన్ట్ హెయిర్ కట్..’అని చెప్పారు.
కానీ ముషారఫ్ చెప్పినా ధోని మాత్రం ఆయన చెప్పిన పది రోజుల తర్వాతే హెయిర్ కట్ చేయించుకోవడం గమనార్హం. ఇక ముషారఫ్.. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. వారి కుటుంబం 1947లో న్యూఢిల్లీ నుంచి కరాచీకి తరలివెళ్లింది. ముషారఫ్ కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.
లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.ముషారఫ్ 1964లో పాకిస్థాన్ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు. 1998లో ఆయన జనరల్ స్థాయికి పదోన్నతి పొందారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిని చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షునిగా కొనసాగారు. అభిశంసనను తప్పించుకునేందుకు పదవికి రాజీనామా చేశారు.