Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్: ఆన్ లైన్ లో క్రికెట్ పాఠాలు చెబుతున్న ధోని, అశ్విన్

ఆన్‌లైన్‌ శిక్షణ, వీడియో పాఠాలతో స్పోర్ట్స్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. అవసరం ఆవిష్కరణకు మూలం. సైన్స్‌ సహా ఎన్నో రంగాల్లో ఆవిష్కరణలు ఈ సూత్రాన్ని రుజువు చేశాయి. ఇప్పుడు క్రీడా రంగం సైతం ఈ ఫార్ములాను అందిపుచ్చుకుంది. 

Dhoni, ashwin turn online to teach cricketing classes
Author
Hyderabad, First Published Apr 12, 2020, 11:22 AM IST

కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగం పడకేసింది. ఇండోర్‌, అవుట్‌డోర్‌ అనే తేడా లేకుండా అన్ని క్రీడలు నిలిచిపోయాయి. బతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అన్న కేసీఆర్ సూత్రాన్నే ఇప్పుడు అన్ని రంగాలు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నాయి. 

ఆట కంటే ఆరోగ్యమే మిన్న అంటూ అందరూ వైరస్‌పై దాడి నుండి తమను తాము రక్షించుకుంటూ సమాజంలో ఆ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఓ నెల షెడ్యూల్‌ నష్టపోయిన క్రీడా రంగం.. మరో 2-3 నెలలు ఇదే పరిస్థితిని చవిచూసే ప్రమాదం లేకపోలేదు. నిర్దేశిత విరామం ఆటగాళ్లకు మేలు చేసేదే, కానీ గమ్యం లేని విరామం కచ్చితంగా చేటు చేయగలదు. 

వర్థమాన క్రీడాకారులు ఈ సమయంలో దృష్టిని ఇతర అంశాలపై మరల్చేందుకు ఆస్కారం ఎక్కువ. దీంతో లాక్‌డౌన్‌లోనూ క్రీడాకారులు ఆటపై దృష్టి సారేంచేందుకు కొత్త మార్గం ఎంచుకున్నారు. 

ఆన్‌లైన్‌ శిక్షణ, వీడియో పాఠాలతో స్పోర్ట్స్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. అవసరం ఆవిష్కరణకు మూలం. సైన్స్‌ సహా ఎన్నో రంగాల్లో ఆవిష్కరణలు ఈ సూత్రాన్ని రుజువు చేశాయి. ఇప్పుడు క్రీడా రంగం సైతం ఈ ఫార్ములాను అందిపుచ్చుకుంది. 

లాక్‌డౌన్‌ వేళ డైరెక్ట్ గా శిక్షణకు తావు లేదు. దీంతో చాలా క్రీడల్లో కోచ్‌లు ఆన్‌లైన్‌ శిక్షణకు మళ్లుతున్నారు. ఆన్‌లైన్‌లో పాఠశాల సిలబస్‌ను సక్సెస్‌ఫుల్‌గా చెబుతున్న రోజుల్లో, ఇప్పుడు ఆన్‌లైన్‌ శిక్షణ కొత్త ఆవిష్కరణ ఏంటనే సందేహం కలగటం సహజమే. 

ఆన్‌లైన్‌ పాఠాలు కొత్త కాదు, కానీ క్రీడా రంగంలో ఆన్‌లైన్‌ శిక్షణ పూర్తిగా కొత్త. కోచ్‌ ఒకచోట, అథ్లెట్‌ ఒక చోట ఉండి ఆన్‌లైన్‌ సూచనలతో శిక్షణ తీసుకున్న సందర్భం లేదు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ క్రీడా రంగాన్ని అటువైపు మళ్లించింది. 

భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోని, ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఒకేసారి ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నారు!. ధోని, అశ్విన్‌లకు క్రికెట్‌ అకాడమిలు ఉన్నాయి. తన క్రికెట్‌ అకాడమిలో ధోని నేరుగా శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. 

కానీ శిక్షణ తీరుపై కోచ్‌లకు పలుమార్లు పాఠాలు చెప్పాడు. ఇప్పుడూ అదే మార్గం కొనసాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌ వేళ అకాడమి కోచ్‌లకు మెళకువలు చెబుతూ, ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. 

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ ద్వారా కోచ్‌లు శిక్షణ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ' ఆన్‌లైన్‌ శిక్షణకు ఇప్పుడు ఆసక్తి ఎక్కువగా ఉంది. పోస్ట్‌ చేసిన ప్రతి వీడియోను అథ్లెట్లు ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రతి వీడియోకు కనీసం 10,000 వ్యూస్‌ వస్తున్నాయి' అని ధోని అకాడమి చీఫ్‌ కోచ్‌ సత్రజిత్‌ లహిరి అన్నారు. 

క్రమం తప్పకుండా డెమో డ్రిల్స్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో అథ్లెట్లు సైతం తమ వీడియోలను కోచ్‌లతో పంచుకుంటున్నారు. కోచ్‌లు వీడియో చూసి ఎక్కడ మెరుగుపడాలో వీడియో ద్వారా చూపిస్తున్నారు. 

బౌలర్లు లేరు కాబట్టి, బ్యాట్స్‌మెన్‌ బాల్‌ను గోడకు కొట్టి, నెమ్మదిగా ఆడాలి. దీని ద్వారా బ్యాట్స్‌మన్‌లో బలమైన డిఫెన్స్‌, చేతి-కంటి సమన్వయం గొప్పగా మెరుగవుతాయి. బౌలర్లు సైతం బంతులు విసురుతున్నట్టు డెమో యాక్షన్‌తో వీడియోలు పెడుతున్నారు.

బౌలింగ్‌ యాక్షన్‌, లోడింగ్‌ అప్‌ పోజిషన్‌లపై కోచ్‌లు సూచనలు చేస్తున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ అకాడమి అథ్లెట్లకు నేరుగానే పాఠాలు చెబుతున్నాడు. సాధారణ శిక్షణ కంటే ఆన్‌లైన్‌ శిక్షణను అథ్లెట్లు మరింత శ్రద్ధగా ఫాలో అవుతున్నారని తమిళనాడు, సీఎస్‌కే మాజీ ఆటగాడు విద్యుత్‌ శివరామకృష్ణన్‌ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios