Asianet News TeluguAsianet News Telugu

బేబీ ఏబీడీ విధ్వంసం.. రికార్డు స్కోరు చేసిన బ్రెవిస్.. టీ20లో అత్యధిక స్కోరు రికార్డు బద్దలు

Dewald Brevis: ముంబై ఇండియన్స్  యువ సంచలనం, అభిమానులంతా బేబీ ఏబీడీగా పిలుచుకునే డెవాల్డ్ బ్రెవిస్  టీ20లో రికార్డుల దుమ్ము దులిపాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసి  సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. 

Dewald Brevis Smashes 57 Balls 162 in CSA T20 Challenge, Creates Records
Author
First Published Nov 1, 2022, 10:52 AM IST

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సీఎస్ఎ  టీ20 ఛాలెంజ్ లో డెవాల్డ్ బ్రెవిస్ రెచ్చిపోయాడు.  దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆటను పోలి ఉండే  బ్రెవిస్ ను.. అభిమానులంతా బేబీ ఏబీడీ అని పిలుచుకుంటారు. సీనియర్ ఏబీడీకి తగ్గట్టుగానే జూనియర్ ఏబీడీ కూడా టీ20లో రికార్డులు తిరగరాస్తున్నాడు. సీఎస్ఎ టీ20 ఛాలెంజ్ లో భాగంగా సోమవారం టైటాన్స్ - నైట్స్ మధ్య ముగిసిన మ్యాచ్ లో బ్రెవిస్.. 57 బంతుల్లోనే  ఏకంగా 162 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసంలో 13 ఫోర్లు, 13 సిక్సర్లు ఉండటం గమనార్హం. 

సీఎస్ఎ టీ20 ఛాలెంజ్ లో భాగంగా పోచెఫ్స్ట్రోమ్  లోని సెన్వాస్ పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత టైటాన్స్ జట్టు బ్యాటింగ్ కు దిగింది.  తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టిన  బ్రెవిస్.. సిక్సర్లు, ఫోర్లతో గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ అలరించాడు.  35 బంతుల్లోనే  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

సెంచరీ పూర్తయ్యాక బ్రెవిస్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత కేవలం  17 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టాడు.  52 బంతుల్లోనే అతడు 150 దాటాడు.   చివరికి 57 బంతుల్లో  162 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో బ్రెవిస్.. క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్ తర్వాత టీ20 ఫార్మాట్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

టీ20లలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు : 

- క్రిస్ గేల్ : 66 బంతుల్లో 175 నాటౌట్ (2013)
- ఆరోన్ ఫించ్ : 76 బంతుల్లో 172 (2018) 
- హమిల్టన్ మసకద్జ : 71 బంతుల్లో 162 నాటౌట్ (2016) 
- హజ్రతుల్లా జజాయ్ : 62 బంతుల్లో 162 నాటౌట్ (2019) 
- డెవాల్డ్ బ్రెవిస్ : 57 బంతుల్లో  162 (2022) 

 

బ్రెవిస్ విధ్వంసంతో  టైటాన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బ్రెవిస్ తో పాటు జివేషన్ పిల్లే (52) హాఫ్ సెంచరీతో రాణించాడు.  వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 14.3 ఓవర్లలోనే ఏకంగా 179 పరుగులు జోడించారు. 

అత్యధిక స్కోరు రికార్డు బద్దలు.. 

అనంతరం లక్ష్య ఛేదనలో నైట్స్ జట్టు.. నిర్ణీత  20 ఓవర్లలో 230 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో కూడా గిల్హాన్ (51), గెరాల్డ్ (37), ఇసాక్  (28), పాట్రిక్ (22), జాక్వస్ (28) పోరాడారు.  కానీ  ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో  వారి బాదుడు సరిపోలేదు.  ఇరు జట్ల బాదుడుతో టీ20లో ఒక మ్యాచ్ లో అత్యధిక స్కోరు నమోదైంది.  టైటాన్స్ 271 పరుగులు చేయగా.. నైట్స్ 230 పరుగులు చేసింది. రెండు జట్లూ కలిపి ఏకంగా 501 పరుగులు రాబట్టడం గమనార్హం.  ఇరు జట్ల బౌలర్లకు పీడకలలా మారిన ఈ మ్యాచ్ లో పరుగులు వరదై పారాయి. దేశవాళీతో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లో కూడా ఇదే రికార్డు. గతంలో అత్యధిక స్కోరు న్యూజిలాండ్ (2016లో) లోని ఒటాగో (249), సెంట్రల్ డిస్ట్రిక్స్ (248) కలిపి  497  పరుగులు నమోదు చేశాయి.  ఆ రికార్డు తాజాగా నైట్స్ -  టైటాన్స్ మ్యాచ్ తో చెరిగిపోయింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios