కగిసో రబడ... ఐపిఎల్ సీజన్ 12 లో అత్యంత సక్సెస్‌ఫుల్ బౌలర్. ప్రత్యర్థులను తన బౌలింగ్ తో బెంబేలెత్తించి డిల్లీకి అద్భుతమైన విజయాలను అందించాడు. చాలాఏళ్ల తర్వాత డిల్లీ పాయింట్స్ టేబుల్ లో టాప్  లో నిలిచిందన్నా, ప్లేఆఫ్ బెర్తును ముందే ఖాయం చేసుకుందన్నా అందులో రబడ పాత్ర మరిచిపోలేనిది. ఇలా లీగ్ దశ మొత్తంలో డిల్లీ జట్టుకు ప్రధాన బలంగా నిలిచిన రబడ కీలకమైన సమయంలో ప్లేఆఫ్ కు దూరమయ్యాడు. దీంతో తదపరి మ్యాచుల్లో డిల్లీపై ఈ ప్రభావం పడనుంది. ఇలా రబడ ఐపిఎల్ నుండి అర్థాంతరంగా నిష్క్రమించడంపై డిసి చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించారు. 

రబడ వంటి టాప్ బౌలర్ జట్టుకి దూరమవడం చాలా దురదృష్టకరమని పాంటింగ్ అన్నాడు. కీలకమైన సమయంలో అతడు ఐపిఎల్ కు దూరమవడం లోటేనని...ఆ లోటును ఎలా పూడ్చుకోవాలో తమకు తెలుసన్నాడు. డిల్లీ జట్టులోని ప్రతి ఆటగాడు రబడ లేని లోటును తీరుస్తారని పేర్కొన్నాడు. జట్టుపై తనకు పూర్తి నమ్మకముందని...క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును ఆదుకోడానికి ప్రతి ఒక్క ఆటగాడు ముందుకు వస్తాడని అన్నారు. తప్పకుండా ఈసారి ఐపిఎల్ ట్రోపి డిల్లీదేనని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.    

బుధవారం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రబడ ఆడలేదు. స్వల్పగాయం కారణంగా ఆ ఒక్క మ్యాచ్ కే అతడికి విశ్రాంతినిచ్చినట్లు డిల్లీ మేనేజ్ మెంట్ ప్రకటించింది. అయితే  మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని తమ జట్టులో కీలక బౌలర్ రబడ విషయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ నుంచి వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా అతడికి కబురు పెట్టింది. ఫలితంగా అతడు మిగతా ఐపీఎల్‌ మ్యాచులకు దూరమయ్యాడు.

రబడ లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి గెలుపు కష్టంతో కూడుకున్న పనే. మొన్న మ్యాచ్ లో కూడా రబడ లేకపోవడం వల్లే ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిందనే వాదనలు వినిపించాయి. ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్‌లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును రబడ వీడటం పెద్ద దెబ్బగానే చెప్పాలి.