ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు రిషబ్ పంత్ కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా వుందని డిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. అతడు ఇప్పుడు ప్రకటించిన 15 మందిలో కాదు బరిలోకి దిగే తుది 11లో కూడా వుంటాడని అనుకున్నానని పేర్కొన్నాడు. కానీ ఇలా ఏకంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమవడం చాలా బాధాకరమన్నారు. ఇలా టీమిండియాలో చోటు దక్కక మంచి కసితో వున్న పంత్ మిగతా ఐపిఎల్ మ్యాచుల్లో పరుగుల వరద పారిస్తాడని పాంటింగ్ జోస్యం చెప్పాడు. 

ప్రస్తుతమున్న భారత యువ క్రికెటర్లలో పంత్ అత్యుత్తమ బ్యాట్ మెన్ అని కితాబిచ్చాడు. భారత జట్టుకు సమస్యగా మారిన నాలుగవ స్థానానికి అతడు చక్కగా సరిపోతాడని పేర్కొన్నాడు. కేవలం అక్కడే కాదు మిడిల్ ఆర్డర్లో ఎక్కడైనా  ఆడి రాణించగల సత్తా అతడి సొంతమన్నాడు. భారత జట్టు బ్యాటింగ్ కు పంత్ ప్లస్ అయ్యేవాడని...ఆ అవకాశాన్ని టీమిండియా కోల్పోయిందని పాంటింగ్ పేర్కొన్నాడు. 

రిషబ్ పంత్ చాలా చిన్న వయసులోనే మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడని...అతడి కెరీర్ ముగిసేలోపు కనీసం 3 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడతాడని నమ్మకం తనకుందన్నాడు. రిషబ్ పంత్ ని భారత జట్టే వదనుకుందని...డిల్లీ కాదని తెలిపాడు. మిగిలిన ఐపిఎల్ మ్యాచుల్లో పంత్ విశ్వరూపాన్ని చూస్తామని పాంటింగ్ వెల్లడించాడు. 

ప్రపంచ కప్ జట్టులో సెలెక్టవ్వనందుకు పంత్‌ అసహనంతో వున్నాడని తాను అనుకోవడం లేదన్నాడు. అతడు చాలా తెలివైనవాడని... పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరిస్తాడని అన్నాడు. అతన్ని ఎంపిక చేయపోవడానికి సెలక్టర్ల వద్ద కారణాలు వుంటాయని...కానీ పంత్ వద్ద కేవలం కసి మాత్రమే వుంటుందన్నాడు. ఈ కని డిల్లీ క్యాపిటల్్స్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పాంటిగ్ అభిప్రాయపడ్డారు.