బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు పేసర్ దీపక్ చాహర్. హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని సరికొత్త గణాంకాలను నమోదు చేశాడు.

మ్యాచ్ అనంతరం చాహర్ మీడియాతో మాట్లాడుతూ.. తానెప్పుడూ ఈ తరహా ప్రదర్శన చేస్తానని కలలో కూడా అనుకోలేదని.. కాకపోతే తన కష్టానికి తగిని ఫలితం వచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. తన చిన్నతనం నుంచి క్రికెట్‌లో రాణించడం కోసం శ్రమిస్తూనే ఉన్నానని.. అందుకు ఫలితం ఇన్నాళ్లకు వచ్చిందేమోనని తెలిపాడు.

కాగా.. ఈ మ్యాచ్‌లో ఒకదశలో బంగ్లాదేశ్‌తో ఓడిపోయి సిరీస్‌ సైతం కోల్పోయే స్థితిలో భారత్ నిలిచింది. 43 బంతుల్లో 65 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో నిలిచిన బంగ్లాను దీపక్ చాహర్ ఓడించాడు.

Also Read:‘రిటైర్మెంట్ తీసుకోవాల్సింది ధోనీ కాదు.. పంత్’.. పాపం మరో సారి ట్రోల్స్

చాహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

18వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన దీపక్.. షఫీయుల్ వికెట్‌ను.. చివరి ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌ను పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా భారత్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

అంతేకాకుండా సిరీస్ మొత్తంలో 10.2 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. తద్వారా చివరి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డులను గెలుచుకున్నాడు.

చాహర్ కన్నా ముందు మలింగ, బ్రెట్‌లీ, ఓరమ్ సౌతీ, తిసారా పెరీరా, అష్రఫ్, రషీద్ ఖాన్, హస్నయిన్, ఖవర్ అలీ, వనువా ఈ ఘనత సాధించారు. దీనితో పాటు అశ్విన్, బుమ్రా‌ల తర్వాత టీ20లలో 50 వికెట్లు పూర్తిచేసుకున్న మూడో భారత్ బౌలర్‌గా దీపక్ చాహర్ రికార్డు సృష్టించాడు.

Also Read:ఇలాగైతే కోహ్లీకి తలనొప్పే: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

అలాగే టీ20లలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గాను అవతరించాడు. అంతకు అజంతా మెండిస్ (6/8), యజువేంద్ర చాహల్(6/25) ఈ ఘనత సాధించారు. కాగా నాగపూర్‌లో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

శ్రేయస్ అయ్యర్ 62, కేఎల్ రాహుల్ 52 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. నయిమ్ 81, మిథున్ 27 పరుగులు చేసి పోరాడారు.