Deandra Dottin: కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా బార్బోడస్ జట్టు  ఈనెల 3న భారత్ తో తలపడబోతుంది. కానీ ఈ మ్యాచ్ కు ముందే ఆ జట్టు కీలక ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించింది. 

వెస్టిండీస్ ఆల్ రౌండర్, ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ లో బార్బోడస్ జట్టు తరఫున ఆడుతున్న కీలక ప్లేయర్ డియాండ్రా డాటిన్ ఆ జట్టుకు అనూహ్య షాక్ ఇచ్చింది. తాను అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. సోమవారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం జట్టులో తాను మనలేకపోతున్నానని, టీమ్ లో వాతావరణం తాను ఆశించినట్టుగా లేదని వాపోయింది. డాటిన్.. విండీస్ తరఫున 143 వన్డేలు, 124 టీ20లు ఆడింది. ప్రస్తుతమున్న విండీస్ జట్టు లో అత్యధిక వన్డేలు, టీ20లు ఆడింది ఆమెనే కావడం గమనార్హం. 

సోమవారం తన ట్విటర్ వేదికగా డాటిన్ స్పందించింది. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డుకు బహిరంగ లేఖ రాసింది. తనను ఇన్నాళ్లు ఆదరించిన అభిమానులకు, బోర్డుకు ధన్యవాదాలు తెలుపుతూనే సంచలన కామెంట్స్ చేసింది. 

డాటిన్ స్పందిస్తూ.. ‘ఈ లేఖను నా రిటైర్మెంట్ గా అంగీకరించాలని నా మనవి. ఈ నిర్ణయాన్ని నేను చాలా ఆలోచించే తీసుకున్నాను. క్రికెట్ అంటే నాకు ప్యాషన్. నా క్రికెట్ కెరీర్ లో చాలా ఎత్తుపల్లాలు చూశాను. చాలా సవాళ్లను అధిగమించాను. కానీ జట్టులో ప్రస్తుతమున్న పరిస్థితులకు నేను అలవాటుపడలేకపోతున్నాను. ఇది నా ఆటకు పూర్తి విరుద్ధంగా ఉంది. వెస్టిండీస్ కు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ 14 ఏండ్ల నా కెరీర్ లో ఒక బెస్ట్ ప్లేయర్ గా రాణించేందుకు నన్ను నేను ఎంతగానో మార్చుకున్నాను. కానీ జట్టులో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తూ రిటైర్మెంట్ ప్రకటన చేస్తున్నందుకు బాధగా ఉంది. నా ప్రదర్శన మీద నాకే అనుమానం కలిగే విధంగా ఇక్కడ పరిస్థితులున్నాయి..’ అని రాసుకొచ్చింది. 

Scroll to load tweet…

అయితే వెస్టిండీస్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డాటిన్.. దేశవాళీ క్రికెట్ ఆడతానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయంగా లీగ్ క్రికెట్ లో కూడా పాల్గొంటానని తెలిపింది. కాగా విండీస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె.. బార్బోడస్ జట్టుకు ఆడుతుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. 

కామన్వెల్త్ గేమ్స్ లో వెస్టిండీస్ జట్టు కాకుండా బార్బోడస్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ కొన్ని దీవుల సముదాయం. అయితే బ్రిటన్ పాలన అన్ని కరేబియన్ దీవుల్లో సాగలేదు. అలా సాగి ఉంటే నేరుగా వెస్టిండీస్ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేది. వెస్టిండీస్‌లోని బార్బొడాస్, గుయానా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, లీవర్డ్ ఐస్‌లాండ్, విండ్‌వార్డ్ ఐస్‌లాండ్‌‌లను బ్రిటీష్ ప్రభుత్వం ఆక్రమించుకుంది. మిగిలిన దీవులు ఇతర రాజ్యాల కింద ఉన్నాయి. ఆ తర్వాత ఈ దీవులన్నీ వెస్టిండీస్ గా మారాయి. అయితే ప్రస్తుతం కామన్వెల్త్ లో పాల్గొనేందుకు గాను బార్బోడస్, గయానా జట్ల తరఫున వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ టోర్నీ నిర్వహించింది. ఇందులో గెలిచిన బార్బోడస్ ను కామన్వెల్త్ గేమ్స్ కు పంపింది. మరి బార్బోడస్ జట్టుతో ఉన్న డాటిన్.. ఆగస్టు 3న ఇండియాతో మ్యాచ్ ఆడుతుందా..? లేదా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 

ఇక డాటిన్ తన అంతర్జాతీయ కెరీర్ లో 143 మ్యాచులలో 3,727 పరుగులు చేసింది. ఇందులో 3 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. వన్డేలలో ఆమె 72 వికెట్లు తీసింది. ఇక టీ20లలో 124 మ్యాచులు ఆడి 2,681 పరుగులు చేసింది. టీ20లో కూడా డాటిన్ రెండు సెంచరీలు చేయడం విశేషం. టీ20లలో ఆమె 61 పరుగులు చేసింది.