ఐపిఎల్ సీజన్ 12 ఆరంభం నుండి అత్యంత చెత్త ఆటతీరును కనబరుస్తూ పాయింట్ టేబుల్ లో చివరన నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో అద్భుతం చేసింది. కెప్టెన్ కోహ్లీ వరుస ఓటములతో పెంచుకున్న కసినంతా ఈ మ్యాచుల్లో తీర్చుకుంటున్నాడు. ఇలా నిర్ణయాత్మక మ్యాచుల్లో కోహ్లీ అదరగొడుతూ బెంగళూరు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా వుంచాడు. 

శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతమై ఆటతీరుతో కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇలా బెంగళూరు జట్టుకు భారీ పరుగులు అందించి పటిష్ట స్థితిలో నిలిపిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బెంగళూరు టీంలో కోహ్లీ సహచర ఆటగాడు ఏబి డివిల్లియర్స్ అయితే కోహ్లీకి పొగుడుతూ అతడికి విచిత్రమైన ముద్దపేరుతో సంబోధించాడు. డివిలియర్స్ కోహ్లీని  సంబోదించిన పేరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. 

కోహ్లీ సెంచరీ తర్వాత డివిలియర్స్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. '' విరాట్... నువ్వో లిటిల్ బిస్కట్. మోయిన్ అలీతో కలిసి ఫస్ట్ హాఫ్ లో అదరగొట్టావు. బౌలర్లు సెంకడాఫ్ లో కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు.ఈ  ట్వీట్ అభిమానులకు తెగ నచ్చడంతో దీనికి వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టార్ ఓపెనర్ డివిలియర్స్ ఈ మ్యాచ్ కు దూరమైనా కోహ్లీ అద్భుత సెంచరీతో అదరగొట్టడంతో ఈ భారీ స్కోరు సాధ్యమయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయినా చివర్లో నితీశ్‌ రానా(85), అండ్రే రస్సెల్(65) చెలరేగడంతో లక్ష్యచేధన వైపు వడివడిగా సాగింది. అయనాకూడా కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా 10 పరుగుల తేడాతో బెంగళూరు జట్టే విజయం సాధించింది.