సీజన్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. వరుస పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో ఓ విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మరో ఓటమి మూటకట్టుకుని ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆర్ఆర్, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ జోస్ బట్లర్ 9 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 1 పరుగుకే అశ్విన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

బెన్ స్టోక్స్ 35 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 18 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు.యంగ్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ 1 పరుగుకే రనౌట్ కాగా రాబిన్ ఊతప్ప సీజన్‌లో తొలిసారి బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 32 పరుగులు చేశాడు రాబిన్ ఊతప్ప.

అయితే ఊతప్ప అవుట్ అయిన తర్వాత పరుగులు చేయడానికి వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది రాజస్థాన్. ఆర్చర్ 1, శ్రేయాస్ గోపాల్ 6, రాహుల్ తెవాటియా 14 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోకియా, తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రబాడా తలా ఓ వికెట్ తీశారు.