ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సత్తా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో ఎక్కువ సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు కూడా ముంబయి ఇండియన్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒంటి చేత్తో జట్టు గెలిపించగలిగే సత్తా రోహిత్ కి ఉంది. అయితే.. రోహిత్.. సింగిల్ హ్యాండ్ తో టీం గెలిపించడం పక్కన పెడితే.. సింగిల్ హ్యాండ్ తో సిక్సర్ కొట్టగలడు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆ సిక్సర్ కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో రాణించింది రోహిత్ శర్మ ఒక్కడే. మరోసారి అర్థసెంచరీకి చేరువగా వెళ్లాడు. 40 ప్లస్ స్కోర్ చేశాడు. 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 44 పరుగులు చేశాడతను. అంతేకాకుండా.. సింగిల్ హ్యాండ్ తో చేసిన సిక్సర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఢిల్లీ కేపిటల్స్ టాప్ క్లాస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆ షాట్ ఆడాడు. ఇన్నింగ్ నాలుగో ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ సిక్స్‌గా మలిచిన తీరు.. అతని పవర్ ప్లే సత్తా చాటింది. చివరి బంతిని ఒంటిచేత్తో సిక్స్‌గా మలిచాడు. కుడివైపు బౌల్ చేసిన ఆ బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా ఒంటిచేత్తో సిక్స్‌ కొట్టాడు. 78 మీటర్ల అవతలికి వెళ్లి పడిందా బంతి. దీంతో.. రోహిత్ ని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సింగిల్ హ్యాండ్ తో సిక్సర్ కొట్టడమంటే మామూలు విషయం కాదని ప్రశంసిస్తున్నారు.